నేటి నుండి కేప్ టౌన్ వేదికగా మూడవ టెస్ట్ జరగనుంది. ఇది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. ఇండియా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి దక్కిన ఒక మంచి అవకాశం. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా జట్టులో ప్రస్తుతం ఉన్న వారు దాదాపు చాలా మంది అనుభవం లేని వారే కావడం విశేషం. అందుకే ఈ టెస్ట్ సీరీస్ లో సౌత్ ఆఫ్రికాను క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలు అన్నీ తలక్రిందులు అయిపోయాయి. మొదటి టెస్ట్ లో ఎలాగోలా విజయాన్ని సాధించింది. కానీ రెండవ టెస్ట్ లో కీలక సమయంలో ఫెయిల్ అయి సఫారీల చేతిలో ఓటమి పాలయింది.

ఆ ఓటమితో క్లీన్ స్వీప్ మాట అటుంచితే సీరీస్ సఫారీలకు కోల్పోతుందా అన్న భయం ప్రేక్షకులకు పట్టుకుంది. అంతే కాకుండా ఇప్పుడు ఒక చెత్త రికార్డ్ ఇండియాను వెంటాడుతోంది. ఈ కేప్ టౌన్ వేదికగా గతంలో జరిగిన 5 టెస్ట్ లలో ఇండియా ఒక్కటి కూడా గెలవలేదు. పైగా రెండు టెస్ట్ లను ఓడిపోయింది. దీనితో కనీసం ఈ సారైనా ఇండియా ఆ చేదు రికార్డును చెరిపి... విజయంతో దానికి బ్రేక్ వేస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో రెండవ టెస్ట్ కు గాయంతో దూరమయిన విరాట్ కోహ్లీ తిరిగి తుది జట్టుతో చేరనున్నాడు.

ఇక రెండవ టెస్ట్ లో గాయపడిన మహమ్మద్ సిరాజ్ ఈ టెస్ట్ కు దూరమవుతున్నాడు. ఇతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న హనుమ విహారిని కోహ్లీ కోసం తప్పించేలా ఉన్నారు. ఇక గత మ్యాచ్ లో అర్ధ సెంచరీలతో పర్వాలేదనిపించిన సీనియర్ ఆటగాళ్లు పుజారా మరియు రహానేలకు మరో ఛాన్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ టెస్ట్ లో ఇండియా గెలిచి చరిత్ర సృష్టిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: