భారత్‌కు తొలి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ అందించిన ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మరోసారి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. సాధారణంగా మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే కపిల్... కేవలం క్రికెట్ సంబంధించిన విషయాలపై మాత్రమే అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కపిల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. గతేడాది ట్వంటీ 20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ... డిసెంబర్ నెలలో వన్డే జట్టు సారధ్యానికి కూడా దూరమయ్యారు. దాదాపు రెండేళ్లుగా ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోహ్లీని ప్రస్తుతం టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తప్పించింది. దీంతో... తీవ్ర మనస్థాపానికి గురైన కోహ్లీ... సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన మరుసటి రోజే... టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కోహ్లీ ప్రకటనపై అటు ఆయన అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు కూడా విభిన్నంగా స్పందించారు. చాలా మంది బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా సెలక్షన్ కమిటీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని అలా తప్పించి ఉండాల్సింది కాదని కామెంట్లు చేశారు.

అయితే ఇదే సమయంలో కపిల్ దేవ్ తనదైన శైలిలో స్పందించారు. కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకోవాలే నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కపిల్ తెలిపారు. ఇప్పటికైనా సరే విరాట్ తన ఈగోను పక్కన పెట్టాలని సూచించారు. జూనియర్ల సారధ్యంలో మరింత మెరుగైన ప్రదర్శనతో ఆడాలన్నారు కపిల్ దేవ్. కెప్టెన్సీ అనేది మొదటి నుంచి విరాట్ ఆటతీరుకు భారంగానే మారిందంటూ కపిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీలోని బ్యాట్స్‌మెన్‌కు కెప్టెన్సీ అడ్డుగా మారిందని కపిల్ దేవ్ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు సమర్థిస్తున్నారు కూడా. కెప్టెన్సీ అనేది ఓ బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందన్న కపిల్... ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా విరాట్ పూర్వ ఫామ్‌లోకి వచ్చే అవకాశం వచ్చిందన్నారు. కెప్టెన్‌గా ఎన్నో ఒత్తిడులు ఎదుర్కున్న విరాట్... ఆ బాధ్యతలను వదులుకునే ముందు కూడా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటాడన్నారు కపిల్ పాజీ. గతంలో తాను కూడా జూనియర్ల సారధ్యంలో ఆడిన రోజులను కపిల్ గుర్తు చేశారు. క్రికెట్‌లో ఆట మాత్రమే ఉంటుందని... జూనియర్, సీనియర్ అనే మాటకు తావు లేదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: