RCB (రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు) సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి IPL 2022 సీజన్‌లో రెండో అర్థసెంచరీ మార్క్‌ అందుకొని రికార్డులు నెలకొల్పాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లి ఆట పాత కోహ్లీని గుర్తుకు తెచ్చింది. 54 బంతుల్లో  8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేసి దుమ్ముదులిపాడు. ఒకరకంగా RCB మ్యాచ్‌ గెలవడంలో కోహ్లి మంచి పునాది వేశాడు. ఆఖర్లో ఔటైనప్పటికి అప్పటికే RCBని పటిష్ట స్థితిలో నిలిపాడు. దీంతో చివర్లో మ్యాక్స్‌వెల్‌ 18 బంతుల్లో 40 పరుగులు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి జట్టును విజయంవైపు పరుగులు పెట్టించాడు. కాగా మ్యాచ్‌ విజయం అనంతరం కోహ్లి తన ఆటతీరుపై స్పందించాడు.
 
సదరు విలేఖరి అడిగిన ప్రశ్నకు కోహ్లీ మాట్లాడుతూ.. ''IPL 2022 సీజన్‌లో పెద్దగా ఆడలేకపోయాను. ప్రతీసారి ఎంతో బాగా ఆడిన నేను ఎందుకనో తడబడ్డాను. జట్టు కోసం రాణించలేకపోయాననే విషయం ఎక్కువ బాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మా జట్టుపై నా ఆట చాలా ప్రభావం చూపించిందనే అనుకుంటున్నాను. దీంతో చేజింగ్‌ సమయంలో జట్టు మంచి స్థితిలో కనిపించింది. మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడం వెనుక ఇంతకముందు నేను ఆడిన విధానమే కావచ్చు. మన ఆలోచనా విధానాన్ని సరైన దిశలో ఉంచుకుంటే మంచిది. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే పనికిమాలిన విషయాలు గురించి ఆలోచించడం మానేయాలి." అంటూ చెప్పుకొచ్చాడు.  
 
ఇంకా కోహ్లీ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ లో బాగా ఆడినందుకు అనేక కారణాలు వున్నాయి. నెట్స్‌లో 90 నిమిషాల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. అది ఎంతగానో ఉపయోగపడింది. షమీ వేసిన తొలి ఓవర్లోనే కొన్ని మంచి షాట్లు ఆడడంతో బాగా ఆడగలననే నమ్మకం కలిగింది. ఆ తర్వాత వరుస బౌండరీలతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతూ పోయాను. అయితే ఈ క్రమంలో అభిమానుల నుంచి మద్దతు మాత్రం గట్టిగా లభించింది. వారి ప్రేమకు ఎల్లప్పుడు రుణపడి ఉంటా'' అంటూ పేర్కొన్నాడు. ఇకపోతే గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన కోహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి: