వరల్డ్ కప్ 2022 లో సెమిఫైనల్ వరకు వచ్చి ఓటమితో ఫైనల్ కూడా చేరకుండానే వెనుతిరిగిన రెండు జట్లు ఇండియా మరియు న్యూజిలాండ్ లు. ఆ తర్వాత కాస్త విశ్రాంతి కూడా తీసుకోకుండానే వీరిద్దరూ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ లో న్యూజిలాండ్ తో మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే ల సిరీస్ ను ఆడడానికి హార్దిక పాండ్య మరియు శిఖర్ ధావన్ నేతృత్వంలోని కుర్రాళ్లతో నిండిన జట్లు వచ్చాయి. ఇప్పటికే టీ 20 సిరీస్ లో మొదటిది వర్షార్పణం కాగా, రెండవ మ్యాచ్ లో ఇండియా కివీస్ ను చిత్తు చేసి సిరీస్ లో 1-0 తో ముందంజ వేసింది. ఇక నిన్నటి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి టీ 20 లలో రెండవ సెంచరీ సాధించి తన నెంబర్ వన్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు.

ఇక మిగిలిన ఆఖరి టీ 20 మ్యాచ్ రేపు నేపియర్ లో జరగనుంది. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ ను దక్కించుకుంటుంది, లేదా కివీస్ ఇందులో గెలిస్తే సిరీస్ 1-1 తో సమం అవుతుంది. అయితే కివీస్ కు ఈలోపే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ మరియు బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ ఆఖరి మ్యాచ్ ను ఆడడం లేదన్నది కివీస్ నుండి అధికారిక సమాచారం. తాను అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు తీసుకున్న మెడికల్ అపాయింట్మెంట్ కు వెళ్ళడానికి రేపు మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఇక ఇతని స్థానంలో యువ ఆటగాడు మార్క్ చాప్ మాన్ ఆడే అవకాశం ఉంది. కెప్టెన్ గా సీనియర్ ఆటగాడు టిమ్ సౌథీ బాధ్యతలు తీసుకోనున్నాడు.

వన్ డే సిరీస్ కు యధావిధిగా ఇతను అందుబాటులోకి రానున్నాడు. నిన్న ఓడిన మ్యాచ్ లో విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు... జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయినా అర్ధ సెంచరీతో రాణించాడు. మరి ఇతను లేకుండా ఆఖరి మ్యాచ్ లో కివీస్ ఏ మేరకు ఆడి గెలిచి సిరీస్ ను సమం చేస్తుందా అన్నది తెలియాలంటే రేపు మ్యాచ్ వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: