ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి తన ఫాస్ట్ బౌలింగ్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుతున్నాడు కాశ్మీరీ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ఏకంగా టీమ్ ఇండియా జట్టులో ఉన్న స్టార్ బౌలర్లకు సైతం సాధ్యం కాని రీతిలో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఔరా అనిపించాడు అని చెప్పాలి. బౌలింగ్లో  అతని వేగం చూసిన తర్వాత టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంలో కొత్త దశ మొదలు కాబోతుంది అని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే అతని టీమిండియాలోకి తీసుకోవాలి అంటూ మాజీ ఆటగాళ్లు కూడా డిమాండ్ చేశారు.


 ఇలా సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయిన ఉమ్రాన్ మాలిక్కు అటు భారత జట్టులో మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే తక్కువ సమయంలోనే చోటు దక్కింది అని చెప్పాలి. అయితే మొదట టి20 ఫార్మాట్లో అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ తో  పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకుని జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వన్డేల్లో కూడా అరంగేట్రం చేశాడు అన్న విషయం తెలిసిందే.


 మొదటి 5 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్ ఆ తర్వాత ఐదు ఓవర్లలో మాత్రం ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా 10 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చేసాడు అని చెప్పాలి. ఇక అతని బౌలింగ్ పై ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందించాడు. ఉమ్రాన్ మాలిక్ టి20 ఫార్మాట్ కంటే వన్డేలకే ఎక్కువగా సూట్ అవుతాడు. ఎందుకంటే మ్యాచ్ ఎంత ఎక్కువ సేపు సాగితే అంత ఎక్కువగా మన నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: