’చంద్రబాబు గారు ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా’ ?  ..’ మీరు ఇంట్లో నుండి బయటకు వస్తారా ? లేకపోతే నన్ను హైదరాబాద్ కు రమ్మంటారా’. లేకపోతే మీరు విజయవాడకు వస్తారా’ ? ఇది వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబునాయుడు కు విసిరిన సవాలు. ఎంపి సవాలు ఎందుకు విసిరాడంటే ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులిచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అంటూ చంద్రబాబు చెప్పాడు. పైగా ఇదే విషయమై జగన్ తో  చర్చించటానికి సిద్ధమా అంటూ చంద్రబాబు సవాలు విసిరాడు.

 

చంద్రబాబు విసిరిన సవాలు పైనే  విజయసాయి స్పందించాడు. మరి విజయసాయి సవాలుపై చంద్రబాబు స్పందిస్తాడా ? చూడాల్సిందే. ఎల్జీ కంపెనీ విషయంలో రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. బహుశా ఇటు టిడిపి అటు వైసిపి ప్రభుత్వాల్లోను తప్పులున్నట్లే కనిపిస్తోంది. కాకపోతే ఎక్కువ తప్పులు చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నది వాస్తవం.

ఎల్జీ పాలిమర్స్ సమస్య మొదటిసారిగా 1998లో బయటపడింది. అప్పట్లో కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కూడా కొందర చనిపోయారు. అప్పుడే కంపెనీని జనావాసాల మధ్య నుండి బయటకు తరలించాలనే డిమాండ్ వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. జనాలనే ఏదో మాయచేసి మొత్తానికి కంపెనీ తరలింపు డిమాండ్ ను అదిమేశారు. అప్పటి నుండి వివిధ వ్యవహారాల్లో కంపెనీ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘిస్తునే ఉంది.

 

కంపెనీ ఉల్లంఘనలన్నీ తాజాగా జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం వల్ల బయటపడటంతో విషయం బాగా పెద్దదైపోయింది. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే చంద్రబాబు చేసిన సవాలు విషయమే విచిత్రంగా ఉంది. తన వైపు కూడా అనేక తప్పులు పెట్టుకుని తప్పులంతా జగన్ ప్రభుత్వంలోనే జరిగిందనే కలరింగు ఇస్తున్నాడు. ఇక్కడే వైసిపి నేతలకు మండిపోతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అందరి నుండి అభినందనలు అందుకుంది. తర్వాత జగన్ ప్రకటించిన నష్టపరిహారాన్ని కూడా అందరూ స్వాగతించారు.

 

ఎప్పుడైతే పై రెండు విషయాల్లో జగన్ కు మంచిపేరొచ్చిందో దాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆరోపణలు, పిచ్చి డిమాండ్లు మొదలుపెట్టాడు. దాంతో  ఇరుపార్టీల నేతల మధ్య వివాదం మొదలైంది. చంద్రబాబు గనుక గ్యాస్ లీకేజి విషయంలో జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా ఉండుంటే అసలు గొడవే లేకపోయేది. ఎందుకంటే గ్యాస్ లీకేజి ప్రమాదం, బాధితులకు వైద్య సహాయం, నష్టపరిహారం విషయంలోనే వైసిపి బిజీగా ఉండిపోయింది. వైసిపి వాళ్ళెవరు అసలు చంద్రబాబు గురించే పట్టించుకోలేదు.

 

ఎప్పుడైతే చంద్రబాబు అనవసరంగా ప్రభుత్వాన్ని కెలికాడో  అప్పటి నుండే గొడవ పెరిగిపోయింది. పైగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో చర్చకు సవాలు కూడా చేశాడు. మరి స్పందించిన విజయసాయిరెడ్డి ప్రతి సవాలుకు చంద్రబాబు సమాధానమిస్తాడా ? లేకపోతే ఎప్పటి లాగే పట్టించుకోనట్లే ఉండిపోతాడా ? అన్నది చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: