గత మూడు రోజుల నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో, ఏపీ ప్రజల్లో టీటీడీ భూముల అమ్మకాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ కు ఈ భూముల అమ్మకాల విషయంలో ప్రమేయం ఉందో లేదో తెలీదు కానీ టీటీడీ ఆస్తుల అమ్మకాల వల్ల జగన్ సర్కార్ చెడ్డపేరు మాత్రం మూటగట్టుకుంటోంది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో మంచి పేరు ఈ వివాదం మాత్రం అధికార పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత పెంచుతోందని ప్రచారం జరుగుతోంది. 
 
టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్, ఇతర టీడీపీ నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీటీడీ భూముల విషయంలో జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. టీటీడీ భూముల అమ్మకాలకు ఎన్ని కారణాలు చెప్పినా ఒక వర్గం ప్రజల్లో భూముల అమ్మకాల విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. కొందరు భక్తులు సోషల్ మీడియాలో భూముల అమ్మకంపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 
 
స్థిరాస్తులను విక్రయించేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆస్తుల విక్రయం భక్తుల మనోభావాలకు ముడిపడి ఉండటంతో భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో మంచి పథకాలు అమలు చేసి జగన్ సర్కార్ తెచ్చుకున్న మంచిపేరుకు ఆస్తుల అమ్మకం అదే స్థాయిలో చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. 
 
ప్రజల్లో ఈ భూముల వివాదం గురించి చర్చ జరుగుతోంది. కొందరు టీటీడీ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మెజారిటీ శాతం ప్రజలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏడాది పాలనతో మంచి పేరు తెచ్చుకున్న జగన్ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి ముందడుగులు వేయాల్సి ఉంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాత్రం భవిష్యత్తులో మంచి పాలనే అందించినా వ్యతిరేకత అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. జగన్ ఈ స్థలాల వివాదం విషయంలో ఎలా ముందుకెళుతాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: