తెలుగుదేశంపార్టీ అంటేనే అంతా పసుపు మయం. తాము అధికారంలో ఉంటే మాత్రం మొత్తం పసుపుమయమైపోవాలని కోరుకుంటారు. అదే ప్రతిపక్షంలో ఉంటే మాత్రం నానా గందరగోళం చేసేస్తుంటారు. ఇపుడు గడచిన ఏడాదిగా చంద్రబాబునాయుడు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా కూడా చేస్తున్నది ఇటువంటి గందరగోళమే. నిజానికి ఇది చాలా చిన్న విషయం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ పార్టీ రంగులను ప్రభుత్వ పథకాలకు వేసుకోవటమన్నది చాలా కాలంగా ఉన్నదే. కాకపోతే వైసిపి కాస్త అత్యుత్సాహం చూపించి పంచాయితీ భవనాలకు కూడా వైసిపి రంగులు వేసేసింది. సమస్యంతా ఇక్కడే మొదలైంది.

 

పంచాయితీ భవనాలకు వైసిపి రంగులు వేసుకోవటాన్ని తట్టుకోలేకపోయిన చంద్రబాబు తన మద్దతుదారులతో కోర్టులో కేసు వేయించాడు.  సరే పిటీషన్ అంటూ పడినాక కోర్టు జోక్యం చేసుకుంటుంది కదా. అయితే కోర్టు చెప్పిన మాటలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు.  మళ్ళీ టిడిపి కోర్టు ధిక్కారణ కేసును వేయటంతో చివరకు చిరిగి చాపంతయ్యింది. సరే దీనివల్ల ఇటు వైసిపికి కానీ అటు టిడిపికి కానీ వచ్చిన లాభమూ లేదు అలాగని నష్టమూ లేదు. కాకపోతే కోట్ల రూపాయల ప్రజాధనమే వృధా అయ్యింది. ఆశ్చర్యమేమంటే ప్రభుత్వాన్ని కోర్టు తప్పు పట్టడంపై  చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. శిశుపాలుడని, వంద తప్పులని ఏమిటేమిటో మాట్లాడేశాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా ఇదే పనులు చేశాడు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, అన్న క్యాంటిన్లు చివరకు శ్మశానాలను కూడా వదల్లేదు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రతి కట్టడానికి టిడిపి రంగులే వేసేశారు. మరి అప్పట్లో ఇదంతా తప్పని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎందుకు అనిపించలేదో ?

 

చంద్రబాబుకన్నా జగన్ అడ్వాన్సుడు వెర్షన్ కాబట్టి ప్రభుత్వ పథకాలకే కాకుండా పంచాయితీ భవనాలకే రంగులు వేసేశాడు. నిజానికి జగన్ చేసింది తప్పనటంలో సందేహమే లేదు. పంచాయితీ భవనాలంటే ప్రభుత్వ ఆస్తి. అంటే ప్రజల ఉమ్మడి ఆస్తి. కాబట్టి ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేయటం ముమ్మాటికీ తప్పు. మరి అదే సమయంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు, అన్న క్యాంటిన్ల భవనాలకు కూడా పార్టీ రంగులు వేయటం తప్పే. ఎందుకంటే ప్రభుత్వ భవనాలన్నా, ప్రభుత్వ నిధులతో నిర్మించినా ఏదైనా ప్రభుత్వ ఆస్తి.

 

అంటే ఇపుడు జగన్ చేసిన తప్పులనే మొన్నటి వరకు చంద్రబాబు కూడా చేశాడు. ఇక్కడ చంద్రబాబు వైఖరి విషయంలో గురివింద గింజ సామెత గుర్తుకు రాకమానదు. అధికారంలో ఉన్నపుడు తాను ఏదైతే తప్పులు చేశాడు వాటినే ఇపుడు వైసిపి రిపీట్ చేస్తుంటే చంద్రబాబు తప్పు పట్టడమే విచిత్రంగా ఉంది. మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబు నేర్చుకున్నదేమంటే గురివింద గింజ నీతినే అని అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: