పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, కొమ్మ పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలు దేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, అసలే కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట తిరగడం మంచిది కాదు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాల ను మార్చుకోవడం వల్ల మేలు కలగవచ్చు. జనమోహనుడు లాంటి మొండి నాయకుడు కూడా ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకోక తప్పలేదు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా కూల్‌గా విను..’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

 

****************

 

ట్రెడ్‌ మిల్‌ మీద వాకింగ్‌ పూర్తి చేసి, టవల్‌తో చెమటలు తుడుచుకుంటూ హాల్ లోకి వచ్చాడు ముఖ్యమంత్రి జనమోహనుడు. సతీమణి రాగి అంబలి అందిస్తూ ….

‘‘ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి…’’ అంది దిగులుగా…

‘‘ అవును, మనల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎంతో చేయాలనుకుంటుంటే, ఒక పక్క అపోజిషన్‌,మరో వైపు కరోనా లాంటి వైరస్‌లు అడ్డుతగులుతున్నాయి…’’ అని అసహనంగా అన్నాడు ముఖ్యమంత్రి.

‘‘ బడి పిల్లలు కూర్చొని రాసుకోవడానికి చక్కని బెంచీలు ఇచ్చిండ్రు, వాళ్ల చిట్టిపాదాల కు బూట్లు కూడా ఇవ్వడం వల్ల పేద పేరెంట్స్‌ ఎంతో సంతోషంగా ఉన్నారు.కానీ ఇపుడున్న పరిస్ధితుల్లో టెన్త్‌ ఎగ్జామ్స్‌ పెట్టడం, పిల్లల ప్రాణాలకు ప్రమాదం కాదా…?’’ అందామె.

‘‘ నిజమే … మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా రద్దు చేశాయి.. చిన్నారుల ఆరోగ్యానికి మించింది ఏదీ ముఖ్యం కాదు. విద్యార్ధుందరినీ పాస్‌ చేస్తున్నట్టు రేపే జిఓ ఇద్దాం. ఈ కోర్ట్‌ కేసుల చికాకు వల్ల ఈ విషయం ఆలోచించనే లేదు. టైమ్లీ గుర్తు చేశావు …’’ అని , భార్యను మెచ్చుకోలు గా చూశాడు.

సహాయకుడిని పిలిచి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేయమని ఆదేశించాడు జనమోహనుడు.

ఇంతలో ప్రధాన సలహాదారుడు అమరేశ్వరుడు హడావడిగా లోపలకు వచ్చి…

‘‘ మీరు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు… ఇపుడే టీవీలో స్క్రోలింగ్‌ చూశాను…’’ అన్నాడు కంగారుగా..

‘‘ అవునన్నా… సాయంత్రం ప్రెస్‌ మీట్‌ కూడా పెడుతున్నా… ఏమిటి ప్రాబ్లమ్‌..?’’ అన్నాడు ముఖ్యమంత్రి.

‘‘ మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే. అది అమలు కావాలంటే … ఈ ఒక్క సారికి మా సలహా పాటించాలి… ’’ అని, నోటికున్న మాస్క్‌ తీసి. ఒక రహస్యం సీఎం చెవిలో చెప్పాడు అమరేశ్వరుడు.

 

****************

 

ఆ సలహా ఫలితంగా మర్నాడు విద్యాశాఖ మంత్రి మీడియా ముందు ప్రత్యక్షమై …

‘‘ కరోనా, గిరోనా లేదు. అనుకున్న ప్రకారం టెన్త్‌ పరీక్షలు జరిపి తీరతాం. రద్దు చేసే ప్రశ్నేలేదు. ముక్కుకు గుడ్డ కట్టుకొని వచ్చి పరీక్షలు రాయాల్సిందే!! ప్రాణాల కంటే పరీక్షలే మాకు ముఖ్యం.’’ అని ప్రకటించాడు.

****************

 

బేతాళుడు యీ కథ చెప్పి, ‘‘రాజా నాకొక డౌటానుమానం ! విద్యార్దుల భవిష్యత్‌ కోసం తపించే జనమోహనుడు ముందు ఎక్సామ్స్‌ రద్దు చేయాలనుకున్నాడు కదా, ఆఖరిక్షణంలొ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? ప్రజల్లో చులకన కాడా ? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీకు తుమ్ములు,దగ్గులు వచ్చు గాక…’’ అన్నాడు.

 

దానికి విక్రమార్కుడు ‘‘అంత మాటనకు రాజా, తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ప్రతిమనిషికీ ధైర్యం ,కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి లక్షణాలు తప్పకుండా వుండాలి. వాటితో పాటు లౌక్యం చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి పేద బిడ్డలకు ఇంగ్లీషు చెప్పా ల నుకున్నాడు, నీడలేని వారికి గూడు ఇవ్వాలనుకున్నాడు,రోడ్డుమీద అల్లరి చేసే తాగుబోతుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ న్యాయ స్ధానాల్లో అతడికి ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. అందుకే టెన్త్ విషయం లో రివర్స్ లో వెళ్తున్నాడు. ఇపుడు కూడా ఈ టెన్త్‌ పరీక్షల మీద ఎవరో ఒకరు పిల్‌ వేస్తారు. పరీక్షలు రద్దు అవుతాయి. ఆ విధంగా అయినా ముఖ్యమంత్రి ధ్యేయం నెరవేరుతుంది.’’

 

రాజుకు అలా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.(కల్పితం)

( జర్నలిస్టు శ్యామ్ మోహన్ ఫేస్ బుక్ వాల్ నుంచి )

మరింత సమాచారం తెలుసుకోండి: