విచిత్రంగానే ఉంది అధికార వైసిపి ఎంపి చేసిన తాజా డిమాండ్ వింటే. ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే నరసాపురం వైసిపి ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు ప్రాణభయం ఉంది కాబట్టి కేంద్ర బలగాలు కావాలంటున్నాడు. ఎక్కడైనా ప్రతిపక్షా నేతలు తమకు ప్రాణభయం ఉందని గోల చేస్తారు. తమకున్న భద్రత చాలదు కాబట్టి పెంచాలని డిమాండ్ చేయటం వినుంటారు. కానీ అధికార పార్టీకి చెందిన ఎంపినే ఇటువంటి గోల చేయటమే విచిత్రంగా ఉంది. అసలు కృష్ణంరాజుకు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ? ఆయనేమన్నా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నాడా ?  ఆయనేమన్నా ఫ్యాక్షనిస్టా ?

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నరసాపురం ఎంపిగా గెలిచిన దగ్గర నుండి కృష్ణంరాజు ఓవర్ యాక్షన్ మొదలుపెట్టాడని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. గెలిచిన దగ్గర నుండి ఎంపి పార్టీ లైన్ తో సంబంధం లేకుండా ఇష్టవచ్చినట్లు వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలకు కొదవే లేదు.  తెరవెనుక ఏమి జరిగిందో స్పష్టంగా తెలీదు కానీ ఎంపికి జగన్మోహన్ రెడ్డితో బాగా గ్యాప్ వచ్చిందన్న విషయం మాత్రం అందరికీ అర్ధమైపోయింది. జగన్ పాలనపై ఎల్లోమీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో రాజుకు ప్రచారం కూడా బాగానే వస్తోంది. ఎప్పుడైతే తనకు బాగా ప్రచారం వస్తోందో ఎంపి కూడా రెచ్చిపోవటం మొదలుపెట్టాడు.

 

చివరకు వ్యవహారం ఎంతదాకా వెళ్ళిందంటే  తనను బతిమలాడుకుంటేనే వైసిపిలో చేరినట్లు చెప్పాడు. తాను పోటి చేశాను కాబట్టి నరసాపురంలో వైసిపి గెలిచిందన్నాడు. దాంతో వైసిపి ఎంఎల్ఏలు ఎంపిని గట్టిగానే తగులుకున్నారు.  జగన్ వల్ల తాను గెలవలేదనే వ్యాఖ్యలను ఎంఎల్ఏలందరూ ఫుల్లుగా కౌంటర్లు మొదలుపెట్టారు. అందులోను  అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా అందరూ ఎంఎల్ఏలు ఒకేచోట ఉన్నారు. దాంతో నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఎంఎల్ఏలందరూ ఎంపిని పట్టుకుని ఫుల్లుగా వాయించేశారు. ఎంఎల్ఏలు తనపై మండిపడితే మరి ఎంపి గమ్మునుంటాడా ? అందుకనే వాళ్ళపైనా ఎంపి రెచ్చిపోయాడు.

 

దాంతో రెండు వైపులా ఆరోపణలు, విమర్శలు హద్దులు దాటిపోయాయి. చివరకు నియోజకవర్గాల్లో ఎంపి దిష్టిబొమ్మలను తగలపెట్టేదాకా వ్యవహారం ముదిరిపోయింది. అప్పుడు ఎంపికి ప్రాణభయం పట్టుకున్నట్లుంది. అందుకనే తన ప్రాణాలకు హాని ఉందంటు ఎంపి గోల మొదలుపెట్టాడు. తనకున్న 1+1 భద్రతను పెంచాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాడు. అలాగే జిల్లా ఎస్పీకి కూడా ఓ లేఖను పంపాడు లేండి. అనవసరంగా జగన్ పై నోరు పారేసుకోవటం ఎందుకు ? ఎంఎల్ఏలను కెలకటం ఎందుకు ? ఇపుడు ప్రాణభయం ఉందని గోల చేయటం ఎందుకు ?

 

కాళ్ళా వేళ్ళాపడి బతిమాలి పార్టీలో చేర్చుకుని టిక్కెట్టిచ్చేంత సీన్ కృష్ణంరాజుకు లేదనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణంరాజును వైసిపిలో నుండి బయటకు పంపేశారు ఇంతకుముందే. తర్వాత బిజెపిలో చేరి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరాడు. అక్కడ టిక్కెట్టిచ్చినా కాదని చివరినిముషంలో మళ్ళీ వైసిపిలో చేరాడు.  కృష్ణంరాజు ట్రాక్ రికార్డు చూస్తే గుండుసున్నాయే. నిజానికి కృష్ణంరాజు కాకుంటే వైసిపి ఇంకా మంచి మెజారిటితోనే గెలిచుండేదేమో.  నియోజకవర్గంలో తనకున్న పట్టు వల్లే ఎంఎల్ఏలు గెలిచారని చెప్పుకుంటున్న ఎంపికి మొత్తం మీద వచ్చిన మెజారిటి 30 వేలు మాత్రమే.

 

అంటే తన స్ధాయిని ఎంపిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే ఎంఎల్ఏలందరూ ఒక్కసారిగా దండెత్తి ఎంపిగా రాజీనామా చేసి మళ్ళీ పోటి చేయమంటున్నది. ఎంపిని రాజీనామా చేయమని ఎంఎల్ఏలు సవాలు చేస్తే ఎంపియేమో వాళ్ళని కూడా రాజీనామాలు చేయమని అడగటమే విచిత్రం.  ఇక్కడ వ్యక్తిగత ఇమేజితోనే తాను గెలిచానని చెప్పుకుంటున్నది ఎంపి మాత్రమే. కాబట్టే వెంటనే రాజీనామా చేసి ఆ ఇమేజీ ఏదో మరోసారి నిరూపించుకోమ్మంటూ ఎంఎల్ఏలు సవాలు విసరుతున్నారు.  మరి వాళ్ళ సవాలుకు రాజుగారు స్పందిస్తారా ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: