కాపుల రిజర్వేషన్ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు అబద్ధాలు చెప్పాడు. కాపుల సంక్షేమం పేరుతో  పవన్ కల్యాణ్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.  కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను మరచిపోయాడు అంటూ చెప్పటమే పెద్ద అబద్ధం.  అలాగే కాపులకు చంద్రబాబునాయుడు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను జగన్ అధికారంలోకి రాగానే నిలిపేశాడు అనే అర్ధం వచ్చేట్లుగా మాట్లాడుతున్నాడు.

 

నిజానికి పై అంశాలపై పవన్ మాట్లాడుతున్నది అసత్యాలే అన్న విషయం అందరికీ తెలుసు. మొదటిది కాపులకు  చంద్రబాబు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు చెల్లవన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. కేంద్రం ఓబిసిలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో నుండి చంద్రబాబు 5 శాతం కాపులకు వర్తించేట్లు నిర్ణయించాడు. అయితే దానిపై కొందరు కోర్టుకెక్కటంతో నిర్ణయం అమలుకాకుండా ఆగిపోయింది. పైగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం మళ్ళీ రాష్ట్రానికి తిప్పి పంపేసింది. కాబట్టి మంత్రివర్గ తీర్మానం, అసెంబ్లీ తీర్మానానికి కూడా విలువలేదని తేలిపోయింది. అంటే 5 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు కాపులను మోసం చేసిన విషయం తేలిపోయింది.

 

ఇక కాపులకు జగన్ రిజర్వేషన్ల హామీ ఇచ్చాడు అనే రెండో అంశం. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని జగన్ ఏరోజూ హామీ ఇవ్వలేదు. తమకు రిజర్వేషన్లు కావాలంటూ జగ్గంపేట  ఎన్నికల ప్రచార సభలో కాపులు డిమాండ్ చేశారు. తన పరిధిలో లేని రిజర్వేషన్ అంశంపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని బహిరంగసభలోనే  జగన్  స్పష్టంగా చెప్పాడు. అయితే కాకినాడలో మాట్లాడుతూ బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులకు తన చేతనైనంతగా సాయం చేస్తానని మాత్రమే హామీ ఇచ్చాడు.

 

కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ఇంత స్పష్టంగా చేసిన ప్రకటనను పవన్ వక్రీకరిస్తే ఎవరు నమ్ముతారు ?  పైగా రిజర్వేషన్లపై మోసం చేస్తున్నాడని తెలిసినా అప్పట్లో  చంద్రబాబును నిలదీయటానికి పవన్ కు నోరు లేవలేదు.  ఉన్నది ఉన్నట్లు చెప్పిన జగన్ విషయంలో మాత్రం పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.  కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబు ఏమి చెప్పాడు, జగన్ ఏమి మాట్లాడాడు అన్న విషయాలు సోషల్ మీడియాలోనే అందుబాటులో ఉంది. కాబట్టి ఒకసారి వాటిని పవన్ చూసుకుని మాట్లాడితే బాగుంటుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: