చైనాకు చెందిన యాప్ లను మనదేశం నిషేధించగానే డ్రాగన్ దేశం అల్లాడిపోతోంది. రెండు దేశాల మధ్య పెరిగిపోతున్న ఉధ్రిక్తతల నేపధ్యంలో కేంద్రప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్ లను నిషేధించింది. ఈ నిషేధం మంగళవారం నుండే అమల్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే భారత్ లో తమ యాప్ లు పనిచేయటం మనేశాయో వెంటనే చైనా నానా యాగీ మొదలుపెట్టింది. ఒక్కసారిగా చైనాకు చెందిన యాప్ లను ఓ దేశం నిషేధించటం బహుశా ఇదే మొదటిసారేమో. నిషేధం అమల్లోకి రావటంతో వాటిద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండిపడటంతో చైనా ప్రభుత్వంలో ఆందోళన పెరిగిపోతోంది.

 

మనదేశంలో డ్రాగన్ దేశం యాప్ లు 59 ఉన్నా బాగా పాపులర్ అయిన యాప్ లు టిక్-టాక్, యూసి బ్రౌజర్, క్యామ్ స్కానర్ లాంటివి ఉన్నాయి. టిక్ టాక్ ప్రపంచ మార్కెట్లో మనదేశంలోనే 30 శాతం బిజినెస్ జరుగుతోంది. అలాగే టిక్ టాక్ కంపెనీ సంపాదించుకునే ఆదాయంలో మనదేశం నుండి 10 శాతం ఆదాయం ఆ కంపెనీకి అందుతోంది. మనదేశంలో టిక్ టాక్ ను తక్కువలో తక్కువ 10 కోట్లకు పైగా డౌన్ లోడ్ అయినట్లు సమాచారం. 2019 ఆర్ధిక సంవత్సరంలో హలో యాప్ రూ. 44 కోట్లు సంపాదిస్తే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే సుమారు రూ. 30 కోట్లు సంపాదించిందట. అంటే చైనా యాప్ ల సంపాదనకు భారత్ బంగారుగని లాగ తయారైంది. ఎప్పుడైతే నిషేధం అమల్లోకి వచ్చిందో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే అన్నీ యాప్ లు పనిచేయటం మానేశాయి.

 

ఇదే విషయమై చైనా మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించాలంటూ గోల మొదలుపెట్టింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝూవో లిజియాన్ మాట్లాడుతూ  భారత్ ఇచ్చిన నోటీసును తమ దేశం చాలా తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నట్లు చెప్పాడు. విదేశాల్లో వ్యాపారాలు చేసే తమ సంస్ధలన్నీ చట్టబద్దంగానే ఉంటాయని చెప్పాడు. భారత్ లో చైనా యాప్ లను నిషేధించటం అంతర్జాతీయ వ్యాపార నిబంధనలను ఉల్లంఘించటమే అంటూ మండిపడ్డాడు.

 

ఎప్పుడైతే చైనా యాప్ లు ఇండియాలో బ్యాన్ అయ్యాయో అప్పటి నుండే డ్రాగన్ దేశం నియమాలు, నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలంటూ గోల చేయటం  మొదలుపెట్టింది. లడ్డాఖ్ లోయలోని గాల్వాన్ నదీ ప్రాంతంలో మనదేశ సైనికులపై దాడులు చేసినపుడు, 20 మందిని చంపేసినపుడు చైనాకు ఒప్పందాలేవీ గుర్తుకు వచ్చినట్లు లేదు. అవసరం లేకపోయినా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రేకిత్తించి గొడవలు చేస్తున్నపుడు చైనాకు విలువలు ఏవీ గుర్తుకు రాలేదా ? కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనా ఆర్ధిక పరిస్ధితిపై ప్రభావం చూపటం ఖాయమని తేలిపోయిన తర్వాతే చైనాకు అంతర్జాతీయ ఒప్పందాలు గుర్తుకు రావటమే విచిత్రంగా ఉంది.

 

చైనా యాప్ లను  భారత్ లో నిషేధించటంతో వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని డ్రాగన్ కోల్పోవటం ఖాయం. దాని ప్రభుత్వం అక్కడి ఆర్ధికవ్యవస్ధపై తీవ్ర ప్రభావాన్ని చూపటం కూడా ఖాయమే. అందుకనే భారత్ నిర్ణయంపై డ్రాగన్ పాలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోఏమో తమ యాప్ లను  నిషేధించటం అంత సులభం కాదనుకున్నది డ్రాగన్ ప్రభుత్వం. అయితే ఊహించనిరీతిలో నిర్ణయం తీసుకోవటంతో  ఆర్ధిక పరిస్ధితిని తలచుకుని డ్రాగన్ లో టెన్షన్ పెరిగిపోతోంది.  చైనా రాయబార కార్యాలయం  అధికార ప్రతినిధి స్పందించిన తీరు చూస్తుంటే యాప్ ల నిషేధం చైనాలో ఎంతటి ప్రభావం చూపబోతోందో అర్ధమైపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: