ఇంత కాలానికి  నారావారి పుత్రరత్నం నారా లోకేష్ కెపాసిటికి అగ్నిపరీక్ష ఎదురయ్యేట్లే ఉంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగిస్తే ఉద్యమం చేస్తామంటూ లోకేష్ భీకర ప్రతిజ్ఞ చేసేశాడు. భారీ వర్షాల కారణంగా నీట ముణిగిన పంటలను పరిశీలించేందుకు లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటించాడు లేండి. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే అనంతపురం జిల్లా నుండే  ఉద్యమం చేస్తామంటు ప్రభుత్వాన్ని తీవ్రంగానే హెచ్చరించాడు. తాము వాడుతున్న మోటార్లకు మీటర్ల వద్దని రైతులు మొత్తుకుంటున్నారంటూ లోకేష్ చెప్పాడు. సరే అంతా బాగానే ఉంది మరి మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించేసింది. నిజానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటమన్నది కేంద్రప్రభుత్వ నిర్ణయం అన్న విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఈమధ్యే నూతన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సంస్కరణల్లో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలన్న నిబంధనుంది.



కేంద్రం చట్టం చేయకముందు  ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లును అన్నీ పార్టీలు పరిశీలించాయి. పరిశీలనదశలోనే అకాలీదళ్ లాంటి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. మరికొన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. సానుకూలంగా స్పందిచన పార్టీల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు కూడా ఉన్నాయి.  తర్వాత చట్టం రూపొందించేదుకు బిల్లును కేంద్రం పార్లమెంటును ప్రవేశపెట్టినపుడు  వైసీపీ, టీడీపీ ఆమోదించాయి. ఆ తర్వాత చట్టమైన బిల్లునే కేంద్రం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. అంటే వ్యవసాయ సంస్కరణల్లో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటమన్నది ఓ భాగమని టీడీపీకి ముందే తెలుసు.  తెలిసి పార్లమెంటులో మద్దతిచ్చింది. అదే చట్టాన్ని అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంటే టీడీపీ వ్యతిరేకిస్తోంది. అంటే టీడీపీ ఢిల్లీలో ఒకలాగ రాష్ట్రంలో మరోలాగ డబల్ గేమ్ ఆడుతోందన్న విషయం అర్ధమైపోయింది. మీటర్లు బిగిస్తే రైతులకు నష్టం అన్న వాదన టీడీపీ వినిపిస్తోంది. మరి ఇదే వాదన పార్లమెంటులో ఎందుకు వినిపించలేదు ? బిల్లును పార్లమెంటులో ఎందుకు వ్యతిరేకంచలేదు ? అన్నది ప్రశ్న.




సరే ఇక ప్రభుత్వ వాదన చూస్తే మీటర్లు బిగించినంత మాత్రన రైతులపై భారం పడదని చెబోతోంది. రైతులు చెల్లించాల్సిన మొత్తం విద్యుత్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతోంది. నిజానికి మీటర్లు బిగిస్తే కానీ వ్యవసాయరంగంలో ఎంత విద్యుత్ వాడుతున్నారన్న విషయం తెలీదు. ఏ సమయంలో రైతులు ఎక్కువగా విద్యుత్ వాడుతున్నరనే లెక్కలు కూడా కచ్చితంగా తెలిసిపోతోంది. దానికి తగ్గట్లే విద్యుత్ సరఫరాను సరిచేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో రైతులకు ఇస్తున్న వ్యవసాయ విద్యుత్  సబ్సిడీకి కూడా లెక్కలొస్తాయి. బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందా లేదా అన్న విషయం ముందు మీటర్లు బిగిస్తేనే కదా తెలిసేది ? మీటర్లు బిగించిన తర్వాత బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే అపుడు ఉద్యమం చేస్తామని లోకేష్ చెప్పినా బాగుంటుంది. అసలు మీటర్లు బిగించటాన్నే వ్యతిరేకిస్తామంటూ ప్రభుత్వం వింటుందా ?




సరే మీటర్లు, బిల్లుల గొడవను పక్కనపెట్టేస్తే ప్రభుత్వమైతే మీటర్లు బిగించటం ఖాయమని తేలిపోయింది. మరిపుడు లోకేష్ ఏమి చేస్తాడు ? అన్నదే ప్రధాన ప్రశ్న. ఒకపుడు చంద్రబాబునాయుడు వ్యవసాయమే దండగని ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే 2014 ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి తప్పింది చంద్రబాబే అన్న విషయం లోకేష్ మరచిపోయినట్లున్నాడు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలను రూ. 84 వేల కోట్లని లెక్కకట్టి, చివరకు దాన్ని రూ. 34 వేలకు లెక్క తేల్చారు. చివరకు రూ. 24 వేలే తీరుస్తామని చెప్పారు. తీరా చేసిందెంతయ్యా అంటే రూ. 15 వేలు. బాండ్లని ఇంకోటని, మరోటని కతలు చెప్పాడు చంద్రబాబు. చివరి రెండు విడుతలను ఎగ్గొట్టి దాన్ని వైసీపీ ప్రభుత్వమే తీర్చాలని డిమాండ్ చేసిన ఘనుడు చంద్రబాబు. ఎన్నికల ముందేమో వ్యవసాయ రుణాలను పూర్తిగా తీర్చేసినట్లు చెప్పుకున్నారు. ఇటువంటి ప్రభుత్వంలో మంత్రిగా చేసిన లోకేష్ ఉద్యమాలంటూ పెద్ద పదాలు వాడుతున్నాడు. చూద్దాం లోకేష్ ఏ స్ధాయి ఉద్యమం మొదలుపెడతాడో ?

మరింత సమాచారం తెలుసుకోండి: