ఒకరేమో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు కోర్టు కేసులతో ముప్పు తిప్పలు పెట్టిన ఎంఎల్ఏ. ఇక రెండో వ్యక్తేమో దేశంలోనే ప్రముఖ లాయర్లలో ఒకరు. ఈ ఇద్దరి కలయికపైనే ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. వీళ్ళద్దరు ఎందుకు కలిశారు ? ఎందుకంటే చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగానే. ఇప్పటికే తెలిసుంటుంది ఎంఎల్ఏ అంటే మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డని. ఇక ప్రముఖ న్యాయవాదంటే ప్రశాంత్ భూషణ్. ప్రశాంత్ కు పేదల లాయర్ గా, ప్రజా ప్రయోజనాలు వేసి ప్రభుత్వాలను కోర్టుల్లో ప్రశ్నించే న్యాయవాదిగా మంచి పేరుంది. ఇటువంటి  వీళ్ళిద్దరు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ కేసులో కలిశారు. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళగిరికి సమీపంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయం నిర్మాణం కోసం చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు 3 ఎకరాల 65 సెంట్లు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రీ చంద్రబాబే. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే. కాబట్టి ఇటు పార్టీ నుండి ప్రతిపాదన తెప్పించుకోవటం, ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రతిపాదనను ఆమోదించటం అంతా చంద్రబాబు ఇష్టమే. ఇంతవరకు అయితే పర్వాలేదులే అనుకోవచ్చు. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే కేటాయించిన స్ధలం విషయంలోనే.




అప్పట్లో టీడీపీ కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించిన స్ధలం వాగు పొరంబోకు. పర్యావరణ చట్టం ప్రకారం వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదీగర్భం వేటిల్లో కూడా నిర్మాణాలు చేయకూడదు. పైగా వాటిని ఉన్నదున్నట్లుగా ప్రజలకు ఉపయోగపడే నీటివనరుగానే ఉంచాలి. కానీ ప్రభుత్వం తమదే కాబట్టి వాగుపొరంబోకును కేటాయించేసింది. ప్రభుత్వం కేటాయించేసింది కాబట్టి పార్టీ కూడా గబగబా నిర్మాణం చేసేసింది. పార్టీకి వాగుపొరంబోకును కేటాయించారని తెలియగానే మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెంటనే హైకోర్టులో కేసు వేశారు. వాగుపొరంబోకును నిర్మాణాలకు కేటాయించటం పర్యావరణ చట్టానికి విరుద్ధమంటూ ఆళ్ళ తరపున లాయర్ వాదించినా హైకోర్టు పట్టించుకోలేదు. పైగా అనవసర విషయాల్లో కేసులు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారంటూ అప్పట్లో కోర్టు ఆళ్ళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.




తాను వేసిన కేసును హైకోర్టు కొట్టేసినా వెంటనే ఆళ్ళ మళ్ళీ సుప్రింకోర్టులో కేసు వేశారు. అయితే వివిధ కారణాల వల్ల కేసు ఎన్నిసార్లు విచారణకు వచ్చినా వెంటనే వాయిదాపడిపోతోంది. ఇంతలో ఎన్నికలు రావటం టీడీపీ ఘోరంగా ఓడిపోవటం అందరికీ తెలిసిందే. దానికితోడు గతకొద్ది రోజులుగా ఏపి హైకోర్టు-ప్రభుత్వం మధ్య మొదలైన వార్ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు దేశంలోనే సంచలనంగా మారింది. ఈ విషయంలో  జగన్ చేసిన ఫిర్యాదులపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డే వెంటనే విచారణ జరిపించాల్సిందే అంటూ ప్రశాంత్ ఒకటికి రెండుసార్లు కోరిన విషయం అందరికి తెలిసిందే.




సరే ఈ ఫిర్యాదు విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రశాంత్ భూషణ్ అంటేనే పేదల తరపున వాదించే లాయర్ గా, ప్రజా సమస్యలపై స్పందించే న్యాయవాదిగా పేరుంది.  ఇటువంటి ప్రశాంత్ ను ఎంఎల్ఏ ఆళ్ళ సుప్రింకోర్టులో లాయర్ గా పెట్టుకున్నారు. దీంతో ఆళ్ళ తరపున ప్రశాంత్ మంగళవారం సుప్రింకోర్టులో వాదనలు వినిపించారు. క్షేత్రస్ధాయిలో ఉన్న పరిస్ధితులన్నింటినీ తన వాదనలో ప్రశాంత్ వినిపించారు. దాంతో కేసు విచారణ తర్వాత టీడీపీ ఆపీసు నిర్మాణం గురించిన వివరాలు కావాలంటూ ఏపి ప్రభుత్వం, సీఆర్డీఏ, టీడీపీ ఆఫీసుకు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించింది. గతంలో అసలు కేసు విచారించటమే అనవసరమని హైకోర్టు భావించిన కేసులో సుప్రింకోర్టు టీడీపీకి నోటీసులివ్వాలని ఆదేశించటం  కీలకంగా మారింది. మరి నోటీసులకు టీడీపీ ఏమని సమాధానం చెబుతుంది ? ప్రభుత్వం, సీఆర్డీఏలు ఏ విధంగా స్పందిస్తాయో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: