అవును అలాగని తెలుగుదేశంపార్టీలోనే అనుకుంటున్నారు. 23 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఎంపిల ఉసురే చంద్రబాబుకు బాగా తగిలిందట. రకరకాల ప్రలోభాలకు గురిచేసి  2014లో వైసీపీలో నుండి వీళ్ళందరినీ తెలుగుదేశంపార్టీలోకి చంద్రబాబు లాక్కున్నారు. అధికారపార్టీలోకి వచ్చిన తర్వాత నలుగురు మంత్రులయ్యారు. మిగిలిన ఎంఎల్ఏలు, ఎంపిలు కూడా కొత్తల్లో  బాగానే ఉన్నారు. కానీ తర్వాతే మొదలైంది అసలైన రాజకీయం. మంత్రులు మినహా మిగిలిన ఎంఎల్ఏలు, ఎంపిలను ఎవరు పట్టించుకోలేదు. చివరకు 2019 ఎన్నికల్లో దాదాపు 17 మందికి మాత్రమే  టికెట్లిచ్చారు. ఇందులో కూడా గెలిచింది ఒకే ఒక్క ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ మాత్రమే. టికెట్లు దక్కనివారు, వచ్చినా ఓడిపోయిన వారి ఉసురు చంద్రబాబుకు గట్టిగానే తగిలిందంటున్నారు.




తాజాగా మొదలైన మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన టీడీపీ నేతలు కొందరు వైసీపీలోకి మారిపోయారు. టీడీపీ తరపున నామినేషన్లు వేసి వైసీపీలోకి ఎలా మారిపోతారని చంద్రబాబు మండిపోతున్నారట. టీడీపీ తరపున నామినేషన్లు వేసి వైసీపీలోకి ఎందుకు మారకూడదు ? నామినేషన్లు వేసిన తర్వాత మారకూడదన్నదే చంద్రబాబు రూల్ అయితే మరి గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను వైసీపీలో నుండి టీడీపీలోకి ఎలా లాక్కున్నారు ? ఇదే విషయాన్ని సొంత ఎంపి కేశినేని నాని కూడా అడుగుతున్నారు. విజయవాడ కార్పొరేషన్లోని 39వ డివిజన్ అభ్యర్ధి విషయంలో పెద్ద గొడవ జరుగుతోంది లేండి. వైసీపీ నేతను టీడీపీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వటంపై నాని మీద టీడీపీ నేతలు మండిపోతున్నారు.




వైసీపీ ఎంఎల్ఏలు, ఎంపిలను టీడీపీలోకి చంద్రబాబు లాక్కోవటం తప్పు కానపుడు తాను చేసింది తప్పెలాగవుతుందని ఎంపి వేసిన ప్రశ్నకు మళ్ళీ ఎవరు నోరెత్తలేదు. తాజా సమాచారం ప్రకారం సుమారు 100కి పైగా వార్డుల్లో  టీడీపీ తరపున నామినేషన్లు వేసిన వాళ్ళు ఇపుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. అంటే ఈ 100 వార్డుల్లో పోటీకి టీడీపీ తరపున అభ్యర్ధులే లేరు. ఇలాంటి చిత్రాలు ఇంకెన్ని బయటపడతాయో తెలీదు. మొత్తానికి అప్పటి ఫిరాయింపు ఎంఎల్ఏల ఉసురు చంద్రబాబుకు ఈ రూపంలో గట్టిగానే తగులుతోందని పార్టీలోనే చెప్పుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: