సాలూరు రాజేశ్వరరావు (జననం 1922- మరణం, అక్టోబర్ 25, 1999). తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది. సాలూరి గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ (వేల్‌ పిక్చర్స్) రెండవ చిత్రానికి, (శ్రీకృష్ణ లీలలు,1935), ఇతనిని “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. ఆ చిత్రంలో, ముఖ్యంగా, కంసునితో (వేమూరి గగ్గయ్య) సంవాద ఘట్టంలో, గగ్గయ్యలాంటి ప్రఖ్యాత కళాకారునికి దీటుగా ఆయన పాడినపద్యాలు (”ఔరలోక హితకారి”,”దీనావనుడనే”, “ప్రణతులివె”,”మేనల్లుళ్ళని”, ...) వింటుంటే పదమూడేళ్ళ వయసులోనే సాలూరి సంగీత ప్రతిభ ఎంతటిదో తెలుస్తుంది.


మాయాబజార్ (1936) సినిమాలో సాలూరి రాజేశ్వరరావు పాడిన నను వీడగ గలవే బాలా పాట
“వేల్‌” వారి శశిరేఖాపరిణయం (మాయాబజార్‌ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ) పాడాడు. ఆ చిత్రం పూర్తయిన తరువాత మరొక చిత్రంలో నటించేందుకై కలకత్తాకు చేరుకోవడంతో ఇతని జీవితంలో మరో ముఖ్య ఘట్టం మొదలయ్యింది. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది. అదే, కలకత్తాలో,”న్యూ థియేటర్స్‌ సంగీతత్రయం”తో (ఆర్‌.సి.బోరల్‌, పంకజ్‌ మల్లిక్‌, తిమిర్‌ బరన్‌) పరిచయాలకు, ప్రముఖ గాయకుడు కె.ఎల్.సైగల్‌ వద్ద శిష్యరికానికి దారి తీసింది.


ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన వ్యక్తి సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. ఆయన తదుపరి సంగీత సృష్టిలో అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు. మరికొద్ది కాలానికి చిత్రపు నరసింహరావు దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. కాని ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).

మరింత సమాచారం తెలుసుకోండి: