భోగరాజు పట్టాభి సీతారామయ్య (నవంబర్ 24, 1880 - డిసెంబర్ 17, 1959) స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు సీతారామయ్య నవంబర్ 24 1880 న మద్రాసు ప్రెసిడెంసి రాష్ట్రములోని కృష్ణా జిల్లా ( పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను )గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు.


ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17 న తుదిశ్వాస వదలాడు.పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంధ్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.


ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు అయిననూ, గవర్నర్‌గా మధ్య ప్రదేశ్ వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.ఇతడు 1919లో మచిలీపట్నం నుండి జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. ఆ కాలంలో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆ కొరతను తీర్చడానికి ఇతడు జన్మభూమిని ప్రారంభించాడు. ఈ పత్రిక ఇతని సంపాదకత్వంలో 1930 వరకు వెలువడింది. ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఇతని ఆంగ్లభాషా నైపుణ్యాన్ని దేశానికి చాటింది.

మరింత సమాచారం తెలుసుకోండి: