విప్లవ వీరుడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన శతాధిక వృద్ధుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బాలు దొర 115 ఏళ్ల వయసులో మరణించారు. వయసు మీద పడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాలు దొర మంచానికే పరిమితమయ్యారు. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం (నవంబర్ 22) కన్నుమూశారు.

అయితే గతంలో బాలు దొర తన గతానుభవాలను నెమరువేసుకుంటూ 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలు దొర టీనేజ్ యువకుడినని తెలిపారు. అలాగే అప్పట్లో ఎత్తయిన కొండలపై నివాసం ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు కూడా ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం తన పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలు దొర ఎంతో మందితో పంచుకునేవారు. ఇక బాలు దొర మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆ శతాధిక వ్యక్తి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సేవకుడు అయిన బాలు దొరని చివరి చూపు చూసి నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు. అలాగే బాలు దొర మరణానికి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, అల్లూరి చరిత్ర పరిశోధకుడు పడాల వీరభద్రరావు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

భారత స్వాతంత్య్రం కోసం అహర్నిశలు శ్రమించి పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి మన అల్లూరి సీతారామరాజు. ఆయన రెండేళ్ల పాటు చేసిన తిరుగుబాటు చర్యలు బ్రిటిష్ పాలకులకు కంటిమీద కనుకులేకుండా చేసిన సంగతి మనకు చరిత్రకెక్కిన పాఠాలు చెబుతున్నాయి.. అల్లూరి సీతారామరాజు చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు, విప్లవ భావాలు కలిగిన వ్యక్తి కావడంతో తనకు తెలిసి ఎక్కడైనా, ఎవరికైనా ఎలాంటి అన్యాయం జరిగినా కూడా సహించేవారు కాదు. ఇక ఆఖరికి తనను నమ్ముకున్న ప్రజల కోసం బ్రిటీష్ పాలకుల మీద తిరుగుబాటు కొనసాగిస్తూనే ప్రాణత్యాగం చేశారు. 1924 మే 7న శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు మన భరతమాత ముద్దుబిడ్డ విప్లవ వీరుడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: