ప్ర‌తికారంగానికి ఎన‌లేని సేవ‌లందించారు నార్ల వెంకటేశ్వరరావు.  తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి ఆయన. కొత్త పలుకుబడి, ప్రజాపాత్రికేయానికి శ్రీకారం చుట్టి పత్రికా రంగానికే వెలుగులు పంచారు. మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆయన శతక పద్యాల ద్వారా బాలలకూ చేరువయ్యాడు. రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన ఛాందస విశ్వాసాలపై రాజీలేని పోరు సాగించి హేతుబద్ధమైన ఆలోచనలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించారు.డిసెంబరు 1, 1908 తేదీన మధ్యప్రదేశ్‌లో జన్మించిన నార్ల వెంకటేశ్వరావు కృష్ణా జిల్లాలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.


చిన్నప్పటి నుండీ రచనా వ్యాసంగమంటే విపరీతమైన ఆసక్తిని కనబరిచిన ఆయన మూడు పదులు కూడా నిండని వయసులోనే సొంతంగా గ్రంథాలయం నడిపారట. దాదాపు 20 వేల పుస్తకాలు స్వయంగా సేకరించారట. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర  లాంటి పత్రికలతో ప్రారంభమైన ఆయన జర్నలిజం కెరీర్ ఆ తర్వాత పెద్ద పత్రికల వైపు కూడా మళ్లింది.
కృష్ణా పత్రికతో ప్రారంభించి పాత్రికేయ వృత్తిలో దాదాపు అయిదు దశాబ్దాల పాటు కలమే ఆయుధంగా సామాన్య జన శ్రేయస్సు, సామాజిక చైతన్యం కోసం పాటుపడ్డారు. ఎక్కడా రాజీపడకుండా, ఎవరికీ భయపడకుండా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వివరించేవారు. తేటతెలుగు పదజాలంతో, నుడికారంతో పత్రికా భాషను, పత్రికలను సామాన్య జనానికి చేరువ చేశారు. ఏ ఒక్క ‘ఇజమ్‌‘కూ లొంగకుండా, దేనికీ తలవంచకుండా స్వేచ్ఛగా వృత్తిని కొనసాగించి ఆదర్శ ప్రాతికేయులయ్యారు. పాత్రికేయానికి మార్గదర్శకులయ్యారు.ఆయ‌న రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేయడం విశేషం.



సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు. రామాయణాన్ని, రామ రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ 'శంబూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసిన పాత్రికేయుడు ఆయ‌న‌.

మరింత సమాచారం తెలుసుకోండి: