తెలుగు చిత్ర సీమలోని తొలిత‌రం  నిర్మాత‌ల్లో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) దిగ్గ‌జం లాంటి వార‌నే చెప్పాలి.  తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆయ‌న భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చేసిన సేవ‌ల‌ను గుర్తిస్తూ భార‌త ప్ర‌భుత్వంతో పాటు వివిధ చిత్ర ప‌రిశ్ర‌మలు, క‌ళా సాంస్కృతిక‌ సంస్థ‌లు ఎన్నో అవార్డుల‌తో స‌త్క‌రించాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1987లో)ల‌భించింది. అలాగే  టీ ఎం ఏం పాయ్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు (1972లో), శ్రీవేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలనుంచి గౌరవడాక్టరేట్లు అంద‌జేసి గౌర‌వించాయి.  ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా రెండు సార్లు ప‌నిచేశారు.



సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాలుగుసార్లు, 1980-83 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షుడిగా, నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు కూడా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం.ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట, రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం. ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.



1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. విజయుడనేది మహాభారత వీరుడు అర్జునుడి పేర్లలో ఒకటి. గెలుపును సూచించే ఆ పేరునే నాగిరెడ్డి తమ సంస్థకు ఎన్నుకున్నాడు. ఆ పేరు విజయా సంస్థకు సార్థకం కావడమే గాక పత్రికా ప్రచురణ, వైద్యం లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన్ను విజయాధినేతగా మార్చింది. అర్జునుడి పతాకంపై పర్వతాన్ని మోసుకొస్తున్న హనుమంతుడి బొమ్మ ఉంటుంది. "జెండాపై కపిరాజు(హనుమంతుడు)" అని అందుకే అంటారు. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగోలోనూ ఉంటుంది. లోగోలో "క్రియా సిద్ధి స్సత్వే భవతి" అనే ఆర్యోక్తి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: