సుప్రసిద్ధ భారతీయ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు గణపతి దీక్షితర్ సుబ్రహ్మణ్య అయ్యర్. ప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ద హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు.


మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది. హిందూ ప్రారంభం నుంచి తన ఉనికిని విశిష్టంగా నిలుపుకుంటూ వచ్చింది. సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. సుబ్రహ్మణ్య అయ్యర్ సంప్రదాయవాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించుకున్నారు. ఏదేమైనా సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, ఈ కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది.



1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడన్న పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.హిందూ సమాజంలో సంస్కరణ కోసం సుబ్రహ్మణ్య అయ్యర్ తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఆయన విధవా పునర్వివాహాలను సమర్థించి, అంటరానితనం, బాల్య వివాహాలు నశించాలని ఆశించారు. 13 ఏళ్ళ వయసున్న బాల్య వితంతువు, తన కుమార్తె అయిన శివప్రియమ్మాళ్ కు ఓ యువకునితో 1889లో బొంబాయి కాంగ్రెస్ సమావేశాల్లో వివాహం చేశారు. ఆంగ్ల పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నా మాతృభాష ప్రభావం తెలుసుకుని, బహిరంగ సభల్లో ప్రసంగించేప్పుడు తమిళంలో మాట్లాడేవారు.


 తమిళ జాతీయ కవిగా సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతిని తొలినాళ్ళలో ఆదరించి, ప్రోత్సహించి, తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు.1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక స్వదేశ మిత్రన్ పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు. సుబ్రహ్మణ్య భారతి తన సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరపకాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.తర్వాతికాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకినట్లు తేలింది. 18 ఏప్రిల్ 1916న మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: