భారత అణు కార్యక్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా  వ‌ర్ధంతి నేడు.  భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, వ్యవస్థాపక డైరక్టరు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటాల్ రీసెర్చ్  లో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. అతను భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే కు వ్యవస్థాపక డైరెక్టర్‌. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న TIFR, AEET అణ్వాయుధాల సంస్థలకు అతను డైరెక్టర్‌గా పర్యవేక్షించాడు. అతనికి ఆడమ్స్ ప్రైజ్ (1942), పద్మభూషణ (1954) పురస్కారాలు లభించాయి. 1951, 1953–1956లలో అతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు


1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో, అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో! అన్న సందేహాల‌ను వెలిబుచ్చుతుంటారు చాల‌మంది శాస్త్ర‌వేత్త‌లు. దురదృష్టం ఏంటంటే  ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా.

 

నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్‌ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారంట‌.‘‘భౌతిక శాస్త్రంలోని సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా. 

మరింత సమాచారం తెలుసుకోండి: