20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి  (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ-జ్ఞాపకాలూనూ.


సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడు.వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, ఆయుర్వేద యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - అనుభవాలూ-జ్ఞాపకాలూనూ ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది.


ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు 'ప్రబుద్ధాంధ్ర' పత్రిక నిర్వహించారు. గిడుగు రామమూర్తి లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక అష్టావధానాలు కుడా చేసారు. 1956 లో కనకాభిషేకం అందుకున్నారు.  యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద. శ్రీ పాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు.


మరింత సమాచారం తెలుసుకోండి: