భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల రామారావు ఒకరు. ఆయన అంత గొప్ప చిత్రకారుడని, పైగా తెలుగువ్యక్తి అనీ చాలామంది తెలుగువారికి తెలియదు. 1897వ సం. మార్చి 8వ తేదిన దామెర్ల రామారావు శ్రీ వెంకటరమణరావు, లక్ష్మీదేవి దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు. కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి పంపాడు.



1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరములో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని మద్రాసీ అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి ముక్కునవేలేసుక్న్నారు. నమ్మలేకపోయారు. అమాయకంగా నలుగురిలో కలవక ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సృజనాత్మకత ఉందా? అని అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు ఆతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. కలకత్తా , బొంబాయి వంటి మహానగరాల్లో జరిగిన బ్రిటీషు ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను ఒక సంవత్సరం పాటు అక్కడి గ్యాలరీలో ఆయన బొమ్మలుంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు తార్కాణం.


1923 లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చాడు. 1925 లో 28 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందాడు. ఈయన చిత్రాలను రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ లో భద్రపరచారు. ఆ కీర్తిశేషుని పేర ఒక చిత్రకళామందిరం వెలసింది. అందులో ఆయన వేసిన చిత్రాలు ఉన్నాయి.సీమంతం - 1923 వ సంవత్సరంలో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రమే ఈ ' పుష్పాలంకరణ" ( పువ్వుల ముడుపు) . ఇది ఆంధ్రప్రదేశములో తమ ఇంటి ఆడపడుచులకు తొలికానుపు ముందు చేయు సంబరం. ముతైదువుల సమక్షమున జరుపు ముచ్చటైన వేడుకను ఆయన బార్యకు జరిగిన సీమంతమును చూసి పరవశించి ఆ సంఘటనకు శాశ్వత స్వరూపమును తన రచనా పాటవముతో చిత్రించాడు. రూపు రేఖా విలాసాలను, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణా విధానమును, పేరంటాలకు జరుగు పన్నీటి జల్లులు , అమ్మలక్కల కాలక్షేపపు ముచ్చట్లు , కూర్చునే వివిధ పద్ధతులు ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రము ద్వారా మనకు గోచరిస్తాయి.ఇదే ఆయన చిత్రీకరణలోని ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి: