ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అతనుపై ఓ ఛలోక్తి. కానీ అతను ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్థానో ఎందరికి తెలుసు అనేవారు. తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత అతనును బూత్రేయ అనీ కూడా అనే వారు.


1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ', 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.



ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండటం వలన అతను మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: