"భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు" అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటీష్ క్లబ్ ముందు బోర్డ్ పెట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటీష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత.

అర్థ‌రాత్రి క్ల‌బ్‌పై దాడి
కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ.ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి ప్రీతిల‌త‌. స్వరాజ్య వీరుడు సూర్యసేన్ స‌హకారంతో 1932 సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10-45 గంట‌ల‌కు బ్రిటీష్ క్లబ్ పైన దాడి చేసింది. ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలైంది. క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం. యువ వీరుల్ని చూసి భయంతో గజగజలాడారు బ్రిటీష్ అధికారులు. అప్పటికే చాలా మంది గాయపడ్డారు. ఇంతలో ఒక మూలనుంచి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు. బులెట్ ప్రీతిల‌త భుజంలోకి దూసుకు పోయింది. రక్తం ధార కట్టింది. ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి ప్రీతి ముందుకు సాగింది. ఆమె ధైర్యానికి అధికారులు వణికిపోయారు.

భ‌ర‌త‌మాత‌కు జై అంటూ ప్రాణాలు విడిచి..
క్రమంగా బులెట్ గాయం నుంచి రక్తస్రావం ఎక్కువైంది. ప్రాణాలతో ఆంగ్లేయులకు దొరకడం ప్రీతిలతకు  ఇష్టం లేదు. అందుకే.. తనతో తెచ్చుకొన్న విషం మింగి.. భరతమాతకు జై అంటూ ప్రాణాలు విడిచింది. ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్క సంవ‌త్స‌రాల వ‌య‌సు మాత్రమే. ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవారు. అదీ ప్రీతిలత అంటే. ఇలాంటి ప్రీతిల‌త‌లు ఎంద‌రో తెల్ల‌వారికి వ్య‌తిరేకంగా పోరాడారు. కొన్ని వెలుగులోకి వ‌చ్చాయి.. మ‌రికొన్ని వెలుగులోకి రాలేదు. అంద‌రి ఆశ‌యం ఒక్క‌టే.. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. నా దేశాన్ని స్వ‌తంత్ర దేశంగా చూడాల‌ని.. అర్థ‌రాత్రి స్వాతంత్ర్యం పొందేనాటికి కొంద‌రు వీరులు అమ‌రుల‌య్యారు. కానీ వారంతా ప్ర‌జ‌ల గుండెల్లో జీవించేవున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag