నాన్న ఎల్లప్పుడూ నన్ను వెంటాడే ఓ ఎమోషన్, అంటూ నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తే సినిమాను హిట్ చేసి పారేశారు. వినడానికి సినిమాటిక్ గానే ఉన్నా అది అక్షర సత్యం. నిజానికి ప్రతి మనిషి జీవితం మీద నాన్న ఇంపాక్ట్ చాలా ఉంటుంది. చాలామంది ప్రతి మనిషికి తొలి గురువు తల్లి అని చెబుతుంటారు, నా వరకు నా తొలిగురువు మా నాన్న. ప్రస్తుతానికి ఆయన మా మధ్య లేకపోయినా ఆయన బ్రతకడం ఎలా అనే విషయం నేర్పించడంతో ఆయన అడుగుజాడల్లోనే బ్రతికేస్తున్నా. నిజానికి నా ఊహ తెలిసే టప్పటికి మా నాన్న నాకు దూరం అయ్యారు.



 అప్పటికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా, నాన్న చనిపోతే విపరీతంగా ఏడుపు వచ్చింది కానీ ఆ తరువాత నా జీవితం సమూలంగా మారిపోతుందని అప్పటికి ఏమాత్రం తెలియదు. ఆయన ఉండి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ ఆయన లేని ప్రతి క్షణం ఆయనలా బతకడానికి నేను తపన పడుతూనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఆయన నుంచి నేర్చుకున్న గొప్ప గుణం ఏదైనా ఉంది అంటే అది ఎవరి దగ్గర మాట తెచ్చుకోకుండా బతకడమే. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరికి మన వల్ల చెడు జరగకూడదు అనేది ఆయన నమ్మే సిద్ధాంతం. 



ఆ సిద్ధాంతం కోసం ఎంతో విలువైన ఆస్తులను కూడా ఆయన పోగొట్టుకున్నారు. అలా నాన్న చెప్పిన కొన్ని మాటలు నా జీవితం మొత్తాన్ని ఇప్పటికీ కంట్రోల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మనం బ్రతకడం కోసమే డబ్బు కావాలి కానీ మనం బ్రతికేది డబ్బు కోసం కాదు అనేది ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. బహుశా ఆ మాటల ప్రభావం ఎక్కువగా ఉందేమో డబ్బు వెనక పరిగెత్తకుండా మనసుకు నచ్చిన పని చేస్తూ నలుగురిని నవ్విస్తూ, నలుగురిని చైతన్య పరుస్తూ ముందుకు వెళుతున్నా. నా ఈ ప్రయాణంలో నాన్న చెప్పిన అన్ని మాటలు ఇప్పటికీ పాటిస్తూనే ఉంటాను. ఒక తండ్రికి కొడుకు పేరు తీసుకు రాకపోయినా పర్వాలేదు కానీ పేరు చెడగొట్ట కూడదు అనేది నేను నమ్మే సిద్ధాంతం. ఈ ఫాదర్స్ డే రోజున ఆయనను స్మరించుకుంటూ సెలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: