ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పేరుపడ్డ బిన్ లాడెన్‌ను అమెరికా ప్రత్యేక సైనిక బలగాలు వేటాడి చంపిన 2011 నాటి ఆపరేషన్‌లో డాక్టర్ ఆఫ్రిది పాత్రకు సంబంధించి ఆయన మీద ఇంతవరకూ అధికారికంగా ఆరోపణలు నమోదు చేయలేదు.


ఈ కేసులో బహిరంగ కోర్టు విచారణ చేపట్టనుండటం ఇదే మొదటిసారి. తనకు నిష్పాక్షిక విచారణను నిరాకరిస్తున్నారని ఈ డాక్టర్ ఆది నుంచీ వాపోతున్నారు.ఆయనను జైలులో పెట్టటం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆయనకు పాకిస్తాన్ 33 సంవత్సరాలు జైలుశిక్ష విధించింది. దీనిపై అమెరికా తన నిరసన తెలుపుతూ.. పాకిస్తాన్‌కు తాను అందిస్తున్న సాయంలో 3.3 కోట్ల డాలర్లు (ఆ డాక్టర్‌కు విధించిన ఒక్కో సంవత్సరం జైలు శిక్షకు 10 లక్షల డాలర్ల చొప్పున) కోత విధించింది.


అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తాను ఎన్నికైతే డాక్టర్ అఫ్రిదిని ''రెండు నిమిషాల్లో'' విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు.ఈ డాక్టర్‌ను అమెరికాలో ఒక హీరోగా పరిగణిస్తుంటే.. పాకిస్తాన్‌లో చాలా మంది ఆయనను ఒక ద్రోహిగా చూస్తారు. అమెరికా నేవీ సీల్స్ బలగాలు ఎటువంటి ప్రతిఘటనా లేకుండా పాకిస్తాన్‌లోకి గగన మార్గంలో వచ్చి.. అమెరికాపై 9-11 దాడుల సూత్రధారి అయిన బిన్ లాడెన్‌ను చంపి, అతడి మృతదేహాన్ని కూడా తీసుకెళ్లగలగటం పాక్‌కు తలవంపులు తెచ్చిందని.. అందుకు డాక్టర్ అఫ్రిది కూడా కారణమని వారు భావిస్తుంటారు.


అంతేకాదు.. పాకిస్తాన్ భద్రతా విధానాన్ని నిర్వహించే సైన్యానికి బిన్ లాడెన్ తమ దేశంలోనే ఉన్నాడన్న విషయం తెలుసా అనే ఇబ్బందికర ప్రశ్నలకు కూడా అది తావిచ్చింది.తీవ్రవాద ఇస్లాం మీద అమెరికా సారథ్యంలో జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్.. అసహనంగానే భాగస్వామిగా కొనసాగుతోంది.


ఎవరీ షకీల్ అఫ్రిది?

డాక్టర్ అఫ్రిది గిరిజిన జిల్లా ఖైబర్‌లో ఉన్నతస్థాయి వైద్యుడు. ఆరోగ్య విభాగానికి అధిపతి. అమెరికా నిధులతో చేపట్టిన అనేక రోగనిరోధక చర్యల (వాక్సినేషన్) కార్యక్రమాలకు సారథ్యం వహించారు.ప్రభుత్వ ఉద్యోగిగా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సైనిక పట్టణమైన అబోటాబాద్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలుచేశారు. అక్కడ సైన్యం నీడలోనే బిన్ లాడెన్ జీవిస్తున్నట్లు వెల్లడైంది.ఇది నిర్ధారించుకోవటం కోసం అబోటాబాద్‌లోని ఆ ఇంట్లో నివసిస్తున్న పిల్లల రక్త నమూనా సేకరించాలని అమెరికా నిఘా విభాగం భావించింది. ఆ రక్త నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేసి వారు లాడెన్ బంధువులా కాదా అనేది తేల్చాలన్నది ఉద్దేశం.


డాక్టర్ అఫ్రిది సిబ్బందిలో ఒకరు ఆ ఇంటికి వెళ్లి రక్తం నమూనా సేకరించారని భావిస్తున్నారు. అయితే.. తమ లక్ష్యాన్ని నిర్ధరించుకోవటంలో అమెరికా విజయవంతం కావటానికి ఇది సాయపడిందా లేదా అన్నది తెలియదు.


బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు చంపిన 20 రోజుల తర్వాత 2011 మే 23న డాక్టర్ అఫ్రిదిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన వయస్సు 50 ఏళ్లకు దగ్గరపడుతోంది.ఆయన 1990లో ఖైబర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యలో పట్టభద్రులయ్యారనే విషయం మినహా.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. ఆయనను అరెస్ట్ చేసినప్పటి నుంచీ.. తమపై తీవ్రవాదులు దాడులు చేస్తారనే భయంతో ఆయన కుటుంబం రహస్యంగా జీవిస్తోంది.


ఆయన భార్య అబోటాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు - మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు.డాక్టర్ అఫ్రిది అమెరికా నిఘా సంస్థ కోసం పనిచేశారని అమెరికా అధికారులు 2012 జనవరిలో బహిరంగంగా అంగీకరించారు.


కానీ.. సీఐఏ కోసం పనిచేయటంలో తన పాత్ర ఎంత అనేది ఆయనకు ఎంతవరకూ తెలుసుననే అంశం మీద స్పష్టత లేదు. లాడెన్‌ను అమెరికా బలగాలు చంపిన ఉదంతం మీద విచారణ జరిపిన అబోటాబాద్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన డాక్టర్ అఫ్రిది తన పాత్ర గురించి ఏమీ చెప్పలేదు.


సీఐఏ డాక్టర్ అఫ్రిదిని రిక్రూట్ చేసుకున్నపుడు.. వారి ఆపరేషన్ లక్ష్యం ఎవరన్నది ఆయనకు తెలియదని పాకిస్తాన్ దర్యాప్తు నివేదిక పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: