పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.


శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 05 అవమానం - 02. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "2". ఇది భూసంబంధమైన లేదా గృహ సంభంధమైన లాభాన్ని సూచించుచున్నది.


కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మిశ్రమ ఫలితాలను కలుగచేయును. చేపట్టిన పనులలో విజయం ఏర్పడుతున్ననూ సంతృప్తి ఉండదు. కుటుంబంలో క్రమశిక్షణ లోపించును. సొంత గృహ కోరిక నెరవేరును. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం అందదు. కుటుంబమున, సమాజమున గౌరవ హాని సంఘటనలు. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభ వార్త. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గడ్డుకాలం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు , స్థానచలన ప్రయత్నాలు కలసి వచ్చును. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు. వారసత్వ భాగ్యం కలసి వచ్చును. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలు. వ్యాపార లక్ష్యాలను చేరుకొనుట కష్టం. వ్యాపారం మీద శ్రద్ధ అవసరం. మిత్రుల మీద భాద్యతలు పెట్టుట వలన నష్టపోవు సంఘటనలు కలవు. విద్యార్ధులు శ్రమించవలెను. నూతన విద్యకొరకు చేయు ప్రయత్నములందు పట్టుదల అవసరం. రాజకీయ నాయకులకు లాభవ్యయములు సమానం. అవివాహితుల ప్రయత్నాలు విఘ్నములతో విజయం పొందును.


కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు 03-నవంబర్-2019 వరకూ చక్కటి సంతాన భాగ్యములను కలుగచేయును. పుత్ర సంతానానికి అవకాశములు అధికం. భూసంబంధమైన , గృహ సంబంధమైన వ్యవహారాలలో చక్కటి లాభాలను కలుగచేయును. 04-నవంబర్-2019 నుండి గురువు కలసి రాడు. రక్త సంబంధమైన లేదా నరముల సంబంధమైన ఆరోగ్య సమస్యలను కలుగచేయును. వ్యవహారములందు తగాదాలు ఏర్పడుచుండును.


కర్కాటక రాశి వారికీ శ్రీ వికారి నామ సంవత్సరంలో శని సంవత్సరం అంతా కలసి రాడు. నల్లని వస్తువల వలన సమస్యలను, శత్రుత్వాలను , ఆరోగ్య సమస్యలను , శని గ్రహం నీచ లేదా శత్రు స్థానంలో ఉన్న జాతకులకు ఆర్ధిక ఋణములను ఏర్పరచును. వ్యవసాయ రంగంలోని వారు నల్ల ధాన్యపు పంటలు వేయకూడదు. లోహ సంబంధ వ్యాపారములు చేయువారు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరం అంతా కలసిరారు. వ్యవహరపు చిక్కులను, శత్రువ్రుద్ధి, దుర్జన సహవాసముల వలన వృధా ధన వ్యయమును, అపఖ్యాతిని, వ్యక్తిగత జాతకంలో రాహు - కేతు దోషాలు కలిగిన వారికి పోలీసుల వలన ఇబ్బందులు, కోర్టు సమస్యలు , కారాగృహ ప్రాప్తి వంటి సమస్యలు ఏర్పడు సూచన.


ఏప్రిల్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో వ్యాపార వ్యవహరాదులు ఆశించిన ధనలాభాలు ఏర్పరచవు. సంతాన ప్రయత్నాలకు ఇది చాల మంచి సమయం. ఉద్యోగ జీవనంలో విరోధుల వలన సమస్యలు. వ్యవహారాలు వేగంగా ముందుకు కదలవు. నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టలేరు. కుటుంబములో బరువు - భాద్యతలు పెరుగును. శారీరక మార్పులు సంభవించును. వైవాహిక జీవనంలో సమస్యలు ఏర్పడును. అనవసర మాటల వలన దంపతుల మధ్య దూరం పెరుగును. ఈ మాసంలో 17, 18, 26,27 తేదీలు అనుకూలమైనవి కావు.


మే 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ధనాదాయం బాగుండును. మాతృ వర్గీయుల వలన కుటుంబ జీవనంలో సమస్యలు. వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా నడుచును. పెద్ద వయస్సు వారికి వెన్నుపూస సంభందించిన ఆరోగ్య సమస్య. నిరుద్యోగులకు, ఉద్యోగ జీవనంలో మార్పులు కోరుకోన్నవారు తమ ప్రయత్నాలలో సఫలీకృతం అవుదురు. సొంత మనుష్యుల ద్వారా శుభవార్తలు వినుదేరు. ఈ మాసం తృతీయ వారంలో నూతన వస్తు లేదా ఆభరణాలు అమరును. చివరి వారంలో మిత్రువర్గాలతో విభేదాలు ఏర్పడుటకు అవకాశములు కలవు. ఈ మాసంలో 1, 4, 9, 11, 25 తేదీలు అనుకూలమైనవి కావు.


జూన్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. నూతన వ్యాపారాదుల వలన లాభం. పేరు ప్రఖ్యాతలు లభించును. దాన ధర్మములు చేయుదురు. కుటుంబంలో మాత్రం మీకు వ్యతిరేకంగా మార్పులు జరుగు సూచన. ద్వితీయ తృతీయ శనివారములందు చేయు ప్రయాణాలలో ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచనలు అధికం. చివరి వారంలో తక్కువ ప్రయత్నంతో చక్కటి లాభాలు పొందేదురు. వాహన సౌఖ్యం ఏర్పడును. నూతన పరిచయాల వలన వ్యక్తిగత జీవనంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక సుఖ వ్యాధులు.


జూలై 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో ధనాదాయం బాగున్నప్పటికీ వైవాహిక జీవనంలో అశాంతి కలుగచేయు సంఘటనలు ఏర్పడును. దూరప్రాంత ప్రయత్నాలు లాభించును. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండదు. ధనం కొరకు లేదా బ్యాంకు ఋణాలు కోసం చేయు ప్రయత్నాలకు ఆటంకములు ఉండును. ప్రయాణాలు అధికంగా ఏర్పడు సూచన. ఈ మాసంలో సాహసోపేతంగా వ్యవహరించుట మంచిది కాదు. 20 వ తేదీ నుండి 27 వ తేదీ మధ్య ఆత్మీయులతో సంతోషంగా సమయం గడిపెదరు.


ఆగష్టు 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో నూతన అవకాశములు లభించును. వీసా సంబంధిత విషయాలలో ఆటంకాలు తొలగిపోవును. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్య ఫలితాలు. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులకు ధన వ్యయం. ద్వితీయ వారంలో ఆకస్మిక లాభములు ఏర్పడును. నూతన ఆలోచనలు కలసి వచ్చును. తృతీయ వారంలో కుటుంబ సభ్యుల శస్త్ర చికిత్సకు సంభందించిన ఒత్తిడులు. చివరి వారంలో ఆశించిన ధనం చేతికి అందును. ఈ మాసంలో 8, 9, 10, 12 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.


సెప్టెంబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో వైవాహిక జీవనంలో ఏర్పడిన సమస్యలు తొలగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడును. వ్యాపార వ్యవహారాలలో చేయు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. కుటుంబ భాద్యతలు సులువుగా నేరవేర్చగలరు. ఉత్సాహ పూరిత వాతావరణం ఏర్పడి ఉండును. మాస మధ్యమంలో విందు - వినోదాలలో పాల్గొనేదురు. ఉద్యోగ జీవనంలోని వారికి క్రింది స్థాయి వ్యక్తుల వలన ఊహించని చికాకులు. నూతన ఆదాయ మార్గాల కోసం చేయు ప్రయత్నాలు ఫలించవు. ఈ మాసంలో 13, 19, 21, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు.


అక్టోబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో వారసత్వ లేదా స్థిరాస్థి సంబంధ వ్యవహారాలలో పితృ వర్గీయులతో విభేదాలు ఏర్పడును. వ్యాపారస్థులకు ప్రభుత్వ సంబంధమైన చికాకులు. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడు సంఘటనలు. పెద్దల సాకారం లేదా సలహాల వలన ఉద్యోగ జీవనంలో అభివృద్ధి పొందేదురు. కుటుంబానికి శాశ్వత ప్రయోజనాన్ని కలుగచేసే నిర్ణయాలు తీసుకొందురు. కుటుంబానికి ఆర్ధిక భద్రత ఏర్పడును. ఈ మాసంలో 11, 12, 13 తేదీలలో ఒప్పందాలు చేసుకొనుట, నూతన వ్యక్తులను కలవడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.


నవంబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసం సంతోషకరమైన పరిస్థితులను కలుగచేయును. ధనాదాయం బాగుండును. సువర్ణ లేదా గృహ లేదా నూతన వాహన లాభం ఏర్పడును. క్షణికావేశముల వలన ప్రమాదం. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ మాసంలో ఆరోగ్యం సమస్యలపాలగు సూచన. కుటుంబ పరమైన శ్రమ అధికం అగును. తృతీయ మరియు చివరి వారములలో స్వశక్తితో కార్యములను సిద్ధింపచేసుకొందురు. దూరపు బందువుల సహకారం వలన ఒక సమస్య నుండి బయటపడుదురు. కృతజ్ఞతతో వ్యవహరించవలసిన సమయం.


డిసెంబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో నూతన ఆస్తి కొనుగోలు చేయుటకు అవకాశములు అధికం. అవివాహితులకు చక్కటి వివాహ సంభంధాలు ఏర్పడును. శత్రు విజయం సాధించేదురు. ధనాదాయం సామాన్యం. ప్రయాణాలు కలసిరావు. శ్రమతో కూడుకొని ఉండును. వ్యయ ప్రయాసలు చికాకులను కలుగచేయును. 22వ తేదీ తదుపరి అనుకూలంగా ఉండదు. గౌరవం లోపించు సంఘటనలు, వ్యసనముల వలన, స్నేహితుల వలన తీవ్ర సమస్యలున్నాయి. పితృసంబంధమైన ఖర్మలు చేయవలసి వచ్చును. సమస్యలు సత్వరం పరిష్కారం అగుటకు మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవుదురు.


జనవరి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో అంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. పుణ్యక్షేత్ర సందర్శన చేయుటకు అవకాశం కలదు. ఆదాయం కన్నా వ్యయం అధికం. ఆలోచనలు కార్యరూపం దాల్చుట కష్టం. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నవి. ఎవరిదైనా సహాయ సహకారముల కొరకు వేచివుండాల్సిన పరిస్థితులు. మీ సామర్ధ్యాన్ని నమ్ముకోనుట మంచిది. 22 వ తేదీ తదుపరి ఆర్ధిక పరిస్థితిలో కొంత ఉపశమనం కనిపించును. వైద్య లేదా ఔషధ రంగంలోని వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడు సూచన.


ఫిబ్రవరి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసంలో పరిస్టితులు మెరుగవును. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, స్థిరాస్థి పెట్టుబడులకు , భాత్రువర్గంతో చర్చలకు ఇది మంచి కాలం. పనిచేస్తున్న కార్యాలయాల్లో గుర్తింపు పొందేదురు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొంత తగ్గుముఖం పట్టును. సహనాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఇది. ఈ మాసంలో ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తీ అగు అవకాశములు అధికం. మీ మనోభావములు అర్ధం చేసుకోగల వ్యక్తులు పరిచయమగును. వ్యాపారాదులకు సానుకూల వాతావరణం. ఈ మాసంలో 2, 9, 13, 14, 24, 29 తేదీలు అనుకూలమైనవి కాదు.


మార్చి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:


ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. మానసిక ప్రశాంతత కోరవడును. మనోధైర్యాన్ని కోల్పోవు సంఘటనలు ఏర్పడు సూచన. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం ఏర్పడును. అప్రయత్నంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకొందురు. శారీరక శ్రమ పెరుగును. ఈ మాసంలో అతి ధైర్యంతో ఆలోచనలు చేయకుండా ఉండుట మంచిది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగునట్టు వ్యవహరించుట అవసరమగును. శైవ సంబంధ పుణ్యక్షేత్ర సందర్శన చేయుట మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: