ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణి ఉండలేడు కదా? మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు ~ స్వర్గసుఖాలు ~ పుణ్యఫలాలు వస్తాయి కదా? చెడ్డ చేస్తే సంఘములో చెడ్డపేరు ~ నరకయాతనలు ~ పాప ఫలాలు వస్తాయి.  ఇలా ఏదో ఒక మంచి కానీ చెడ్డ పని చేస్తూ స్వర్గనరకాలను అనుభవిస్తూ మరలా జన్మలెత్తుతూ సంసారచక్రములో ఉండాల్సిందేనా ~ లేక మోక్షము పొందే మార్గమేదైనా ఉందా ~ అని ఆలోచిస్తే ~ గీతలో భగవానుడు ఏమన్నాడో చూడండి!

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్
అంటే ~ అర్జునా! నీవు ఏ పని చేసినా ~ ఏమి తిన్నా ~ ఏ హోమాన్ని చేసినా ~ ఎవరికి ఏదిచ్చినా ~ ఏ తపాన్ని చేసినా ~ అదంతా నాకు సమర్పించు. 
     
ఇలా చేస్తే మనము మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. మొదటిది కర్తృత్వ త్యాగము~ : ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాను అనే అహంకారాన్ని వదలాలి. ఏ కర్మ అయినా దాన్ని ఆ భవగానుడే నాచే చేయిస్తున్నాడు అని భావించాలి.‌ ఏమి చేసినా భగవదర్పితముగా చెయ్యాలి ~ అలా చేస్తే పాపపు పనులను చేయడానికి మనము జంకుతాము.  కర్మసాక్షి అయిన ఆ భగవానుని తలచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటావు.
రెండవది~ ఫలత్యాగము: ఏమి చేసినా ఇది నా కర్తవ్యమని‌ చెయ్యి ~ అంతేకానీ ఇది చేస్తే నాకీ ఫలమొస్తుందనే కోరికతో చెయ్యకు.  నేనేమి చేసినా దాని ఫలము భగవానుడిదే ~ అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్ము.


మూడవది ~ సంగత్యాగము:  ఇది నాది ~ దీన్ని నేనే చెయ్యాలి ~ అంతా నా యిష్టప్రకారమే జరగాలి ~ ఇది నా ఆనందము కోసమే అని బంధాన్ని పెంచుకోకు. అంతా భగవన్ముఖ వికాసము కోసమే ~ ఆయన ఆనందమే నా ఆనందము అని మనస్పూర్తిగా అనుకో.‌

ఏ పని చేసినా ఒక్క నమస్కారాన్ని పెట్టి ఒక్క మాట చెప్పు చాలు ~ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని ~ దీనికి జతగా సర్వే జనాస్సుఖినోభనంతు అని కూడా చెప్పి‌ త్రికరణశుద్దిగా పని చెయ్యి. 


మరింత సమాచారం తెలుసుకోండి: