వేయి నామాల వేంకటేశుడు కొలువైన తిరుమల కొండకు బ్రహ్మోత్సవాలు కొత్త శోభను తీసుకొస్తాయి. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా.. కోరుకున్నవారి కొంగు బంగారు దేవుడా అని భక్తులు కీర్తించగా.. అందంగా ముస్తాబై.. అమ్మవారితో కలిసి భక్తుల వద్దకే వచ్చి దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. అంతటి వైభవోపేతమైన బ్రహ్మోత్సవ వేళ తిరుమలేశుడికి గద్వాల జోడు పంచెలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. 


గద్వాల సంస్థానం నుంచి తిరుమలేశుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. 400 ఏళ్ల కిందట గద్వాల సంస్థానాధీశులు సంప్రదాయబద్ధంగా నేత మగ్గాలపై జోడు పంచెలను ఇక్కడి చేనేత కార్మికులతో తయారు చేయించి.. తిరుమల తిరుపతి దేవస్థానికి అందజేసే ఆచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ ఏటా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి మూల విగ్రహానికి ఏరువాడ జోడు పంచెలు అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గద్వాల సంస్థానాధీషులు కృష్ణరాంభూపాల్‌తో మొదలైన సంప్రదాయం సంస్థానాధీశుల వారసులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తిరుమలకు జోడుపంచెలు చేరుకోగానే అక్కడి ప్రధాన పూజారులు శ్రీవారి చెవిలో స్వామీ ఏరువాడ జోడు పంచెలు అందాయి. మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన పంచెలు అలంకారం చేస్తాం అంటూ అలంకరణ ప్రారంభిస్తారు.


ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు 45 రోజుల సమయం పడుతుంది. నామాల మగ్గంపై నేత పనిని శ్రావణమాసం నుంచి ప్రారంభించిన ఐదుగురు నేత కార్మికులు సంప్రదాయబద్ధంగా నేశారు. వారిలో మహంకాళి కరుణకుమార్, సాకే సత్యం, దామర్ల శన్ముఖరావు, మేడం రమేష్, గద్దె మురళీ ఉన్నారు. మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్కరు తప్పు చేసిన పని  ముందుకు సాగదంటారు. జోడు పంచెలు తయారు మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్న చోట ఇంట్లో నిత్యం పూజలు చేయడంతో పాటుగా గోవింద నామస్మరణం చేస్తారు. సంస్థానాధీశుల తరపున గత ఏడేళ్లుగా ఏరువాడ పంచెలను మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేయిస్తున్నారు. 


దేశం నలు మూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా ప్రత్యేక వేడుకలలో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను మాత్రం శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించడం విశేషం. 11 గజాల పొడవు, 85 అంగుళాల వెడల్పు, ఇరువైపుల 12 అంగుళాల బార్డర్‌తో కంచుకోట కొమ్మ నగిశీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా నూలు, రేషం కలయికతో సంప్రదాయబద్ధంగానే వీటిని తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే  ఏడాది పొడవునా మూలమూర్తికి ఈ జోడు పంచెలను అలంకరించి పూజలు చేస్తారు. మూల విరాట్‌కు ఈ పంచెలు మినహా... మరే వస్త్రాలుండవు. బ్రహ్మోత్సవాలకు కొత్త పంచెలు వచ్చిన తర్వాత పాత పంచెలను శేష వస్త్రంగా, శ్రీవారి ప్రసాదాలతో తిరిగి గద్వాల సంస్థానానికి అందించడం ఆనవాయితీ. 


మహా పుణ్యక్షేత్రంగా అంతర్జాతీయ స్థాయిలో కీర్తికెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానానికి గద్వాల సంస్థానం ... ప్రతీ ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏరువాడ జోడు పంచెలను తిరుమలేశుడికి అందించడం ఆనవాయితీ. స్వామివారికి శిరస్సుపై గద్వాల ఏరువాడ ఉత్తరీయం, ఉత్తరీయం సాలిగ్రామ వస్త్రంగా, మూల విగ్రహం లోపలి భాగంలో గద్వాల ఏరువాడ జోడు పంచెలను అలంకరించడం తెలంగాణకే విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: