దీపావళి పండుగ హిందూ మాత పండుగలలో అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధమైనది. దీపావళి అంటే వెలుగుతున్న దీపాల వరుసలు అని అర్ధం. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలలో దీపాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది.  నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. 


చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే మొత్తం మూడు రోజుల పాటూ జరుపుకునే పండుగ దీపావళి. ఈ రోజున ఉన్నవారైనా.. లేనివారైనా.. ఉన్నంతలో ఇంటి ముందు దీపాలు వరుసగా పెడుతుంటారు. ఇంటి గుమ్మాల దగ్గర, ప్రహరీ గోడలపై, దేవుళ్ల పటాల దగ్గర, తులసి మొక్క ముందు, ఇలా అనేక చోట్ల దీపాలను వరుసగా పెడతారు. దీప అంటే దీపం. ఆవళి అంటే వరుస. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.  


దీపాలను సంపద, ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. అందువల్లే దీపావళి రోజున దీపాలను వెలిగించి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తితో పూజించి ఇంటికి ఆహ్వానిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరమై.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. ఇక దీపావళి పండుగ అంటే అందరికి ఇష్టమే, ముఖ్యంగా పిల్లలకి మరీ ఇష్టం, టపాకాయలు కాలుస్తూ, సందడి చేస్తూ సంతోష పడిపోతారు. దీపావళి హిందువుల పండుగే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో ఈ పండుగను వేడుకగా చేసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: