భక్తితో ముక్తిని సాదించవచ్చూ. ఆ భక్తికే నిలయంగా శ్రీవారు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతి. నిత్యం గోవింద నామాలతో పచ్చని ప్రకృతిమద్య ఏడుకొండల్లో వెలసిన ఆ స్వామి వారి ముందు భక్తిని అంతా శక్తిగా మార్చుకుని తన్మయత్వంలో మునిగి వేడుకుంటుంటే కలిగే అనుభూతి, ఆనందం ఎన్ని జన్మలెత్తిన దక్కదనిపిస్తుంది. శ్రీవారి కనుచూపు మనసును తాకగానే ఈ హృదయనందనవనం ఆ ప్రేమమయి చూపుల స్పర్శకు ముళ్లమధ్యలో ఎదిగే గులాభిలా వికసిస్తుంది. ఎన్ని కోట్లు ఖర్చుచేసిన పొందలేని సంతోషాన్ని ఏడుకొండల్లో ఉన్న ఆనందమూర్తి చెంత అనుభవించ వచ్చూ.

 

 

అందుకే ఆ శ్రీనివాసుని దర్శనం కోసం వేవేల కిలోమీటర్ల నుండి శ్రమకోర్చి భక్తులు వస్తుంటారు. అన్నేసి గంటలు లైన్లల్లో ఉండి ఆయన కటాక్షం కోసం నిరీక్షిస్తుంటారు. ఇక ఈయన సన్నిధానంలో ఉన్న వైకుంఠ ద్వారం మీదుగా దర్శనం చేసుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. ఎందుకంటే వైకుంఠ ద్వారం. సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి ద్వారం. దీన్ని ఉత్తర ద్వారమని కూడా అంటారు.

 

 

అన్ని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాల గుండా భక్తులను పంపి, స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అప్పుడు మినహా సంవత్సరంలో మరెప్పుడూ ఆ ద్వారాన్ని తెరవరు. అయితే వైకుంఠ ద్వారాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని టీటీడీ భావిస్తోంది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించింది. ఇందుకు ఆగమ శాస్త్ర నిపుణులు అంగీకరించారని, పాలక మండలి ఆమోదం తరువాత నూతన విధానాన్ని అమలులోకి తెస్తామని అధికారులు అంటున్నారు.

 

 

వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలను తెరిచి, ఆపై 10 రోజుల పాటు వీటి గుండా భక్తులను పంపాలని, ఈ నిర్ణయం వల్ల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని, మరింత మందికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే వీలుంటుందని అధికారులు అంటున్నారు. ఇకపోతే జనవరి 6 న వైకుంఠ ఏకాదశి రానుంది. పాలక మండలి అంగీకరిస్తే, అప్పటి నుంచి సంక్రాంతి పండగ ముగిసేవరకూ ఈ ద్వారం తెరచుకునే ఉంటుందన్నమాట. నిజమైన భక్తి ఉండి ముక్తికోసం తాపత్రయపడే వారికి ఇదో సువర్ణ అవకాశంగా చెప్పవచ్చూ.

మరింత సమాచారం తెలుసుకోండి: