రాత్రి వేళ నిద్రలోకి జారుకున్నాక ఒక్కోసారి ఉలిక్కిపడి లేస్తుంటారా..? ఏదైనా ఎత్తు నుంచి జారి కిందకి పడిపోతున్నట్లు కలలు వస్తున్నాయా..? భూతాల భవనంలో చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నట్లు కలలు వస్తున్నాయా? అయితే, ఇలాంటి కళలు వస్తే జాగ్రత్త..! మరి. ఆ కళలు ఊహించకుండానే మీ ప్రాణాలు తీయొచ్చు. కొన్ని సినిమాల్లో కలలో జరిగినవే మళ్లీ నిజ జీవితంలో కూడా జరుగుతున్నట్లుగా చూపిస్తుంటారు. అయితే, వాటిని పూర్తిగా తీసి పడేయలేము. కొన్ని సందర్భాల్లో అవి నిజమవుతాయి కూడా. వీటి వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 

 


కొంతమందికి సిక్స్‌త్ సెన్స్ వల్ల కలలో జరగబోయేవి కనిపిస్తుంటాయనే వాదన ఉంది. కానీ, అది ఎంతవరకు నిజమనేది ఎవరూ తేల్చలేకపోయారు. ప్రతి పదిమందిలో ఒకరిని పీడ కలలు వెంటాడుతుంటాయి. మెట్లపై నుంచి లేదా మేడపై నుంచి పడిపోయినట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు, దెయ్యాలు మీదపడి హింసిస్తున్నట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు, జట్టు, పళ్లు రాలిపోవడం, మరణించినట్లు, పాము కాటేసినట్లు ఇలా ఎన్నో పీడకలు వస్తుంటాయి. ఈ పీడ కలల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడే వ్యక్తులు ఆందోళన, తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుకు గురికావచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.

 

నిద్రలో వచ్చే పీడ కలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల కళ్లు మూసి నిద్రపోవాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది క్రమేనా నిద్రలేమికి దారితీస్తుంది. తాజా అధ్యయనాల ప్రకారం.. పీడ కలలు లేదా చెడు కళల వల్ల బాధ, కోపం, గందరగోళం, నిరాశ, అపరాధ భావన, అసహ్యం వంటివి ఏర్పడతాయి. ఇటీవల ఓ సంస్థ 351 మంది పెద్దలపై నిర్వహించిన పరిశోధనలో చాలామంది పీడ కలలతో బాధపడుతున్నారని, వారిని ఏదో చెడు శక్తి తరుముతున్న భావానికి గురవ్వుతున్నారని తేలింది. పెద్దల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది ఈ సమస్య వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు.

 

ఈ పరిస్థితిని ‘స్లీప్ బిహేవియర్ డిజార్డర్’ అంటారని తెలిపారు. జాసన్ ఎల్లీస్ అనే పరిశోధకుడు ‘‘రాత్రి వేళల్లో ఏర్పడే చెడు కలలు రావడానికి కారణాలైతే తెలియరాలేదు. అయితే, వాటి వల్ల కలిగే నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇది క్రమేనా ఒత్తిడికి దారితీసి మనిషిని కుంగదీస్తాయి’’ అని తెలిపారు. పీడకలల వల్ల నిద్రరాకపోతే మానసిక నిపుణులను తప్పకుండా సంప్రదించాలి. ఒత్తిడి వల్ల కూడా పీడ కలలు వస్తాయి. పడుకొనేప్పుడు మొబైల్ ఫోన్లను అతిగా చూడొద్దు. సోషల్ మీడియాలో షేరయ్యే భయానక ప్రమాదాలు, మరణాల వీడియోలను అస్సలు చూడొద్దు. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనే గొప్ప శక్తి మీకున్నట్లు ఊహించుకుని నిద్రపోవాలి. యోగా, ధ్యానం వంటివి ప్రశాంతంగా ఉంచుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: