తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఇక క‌నుమ విష‌యానికి వ‌స్తే..  ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. 

 

పల్లెల్లో పశువులే గొప్పసంపద. ఇదిలా ఉంటే.. క‌నుమ నాడు కాకి కూడా క‌ద‌ల‌ద‌ని అంటారు. అంటే.. సంక్రాంతి పండ‌గ‌కు అత్త‌గారి ఇళ్ల‌కు వ‌చ్చిన కొత్త అల్లుళ్లు కానీ, బంధువులు కానీ, క‌నుమ‌ రోజు బ‌య‌లుదేర‌కూడ‌ద‌నే సామెత ఉంది. అయితే, ఇదినిజానికి ఇప్ప‌టికి అనువ‌ర్తించ‌దు. అయినా.. ఇప్ప‌టికీ పాటిస్తున్నారు. గ‌తంలో మోటారు వాహ‌న ర‌వాణా సౌక‌ర్యం లేని రోజుల్లో ప్ర‌యాణాల‌న్నీ ఎద్దుల బ‌ళ్లు, గుర్రాల బ‌ళ్ల‌పైనే జ‌రుగుతుండేవి. క‌నుమ ముఖ్యంగా ప‌శుప‌క్ష్యా దుల పండ‌గ ఆనాడు ప‌శువుల‌ను, గుర్రాల‌ను చ‌క్క‌గాఅలంక‌రించి, ఆహారం పెట్టి వాటికి ఆరోజు ఏ ప‌నీ చెప్ప‌కుండా రెస్ట్ఇస్తారు. మ‌రియు ఆ రోజు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. 

 

అలాంటి రోజు కూడా ప్ర‌యాణాలు పెట్టుకుంటే.. ఏదైనా సంద‌ర్భంలో ఖ‌చ్చితంగా ప‌శువుల‌ను అదిలించాల్సి ఉంటుంది. ఇంత అలంకారం చేసి, వాటిని పూజించి ఆరోజు కూడా కొట్ట‌డం, అదిలించ‌డం వంటివి చేయ‌డం ఎందుక‌నే కోణంలోనే క‌నుమ‌ రోజు ఎలాంటి ప్ర‌యాణాలు పెట్టుకోకుండా వాయిదా వేసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చేవారు. అయితే ఈ సామెత‌ను నేటి ఆధునిక రాకెట్ యుగంలోనూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించ‌డ‌మే చ‌ర్చ‌నీయాంశం. నిజానికి ప్ర‌స్తుత ప్ర‌పంచంలో అన్నీ మోటారు వాహ‌నాలే క‌నుక ఈ నియ‌మం పాటించాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్ర‌మూ లేదనేది పెద్ద‌ల సూచ‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: