తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండగలలో సంక్రాంతి పండగ ఒకటి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఈ పండుగ జరుపుకునే రోజును మకర సంక్రాంతి అని అంటారు. గడచిన వారం, పది రోజులనుండే జనం సంక్రాంతి పండుగకు సిద్ధమయ్యారు. సొంతూళ్లకు వెళ్లటానికి బస్సులలో, రైళ్లలో ప్రయాణమయ్యారు. కొంతమంది ముందుగానే రిజర్వేషన్ చేసుకొని ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తుంటే మరికొంతమంది మాత్రం బస్సు, రైళ్లలో రిజర్వేషన్ సీట్లు దొరకాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. 
 
రిజర్వేషన్ల కోసం మొక్కులేంటి...? అని ఆశ్చర్యపోవచ్చు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి మాత్రమే ఈ సమస్యలు, కష్టాలు అర్థమవుతాయి. బస్సుల్లో, రైళ్లలో రిజర్వేషన్లు పూర్తవటంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తంటాలు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నా ఆ బస్సులు ప్రయాణికుల అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. 
 
ప్రదాన రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తయిపోవటంతో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఖాళీ సీట్లు ఉన్నా 400 రూపాయల టికెట్ ను 4,000 రూపాయలకు కొనుగోలు చేయటానికి సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు సాహసించలేకపోతున్నాయి. కొంతమంది బస్సుల్లో సీట్లు లభిస్తే చాలని దేవుళ్లను ప్రార్థిస్తుంటే మరికొంతమంది నిలబడి కూడా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తామని చెబుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతి పండుగ ప్రయాణ కష్టాలు మామూలుగా లేవని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తిరుగు ప్రయాణానికైనా రిజర్వేషన్ చేసుకోవాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: