మన హిందువులు ఎంతో బాగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ అతి ముఖ్యమైనది అనే చెప్పాలి. రైతులు చేతికొచ్చిన తమ పంటను అమ్మి, ఇంటినిండా ధాన్యం, చేతినిండా ధనంతో అలానే ఈ పండుగ సమయంలో ఇంటికి కొత్త అల్లుళ్ళు, చుట్టాల రాకతో ఇల్లంతా ఎంతో సందడితో నిండి ఉంటుంది. ఇక ఈ పండుగ నాడు పల్లెల్లో అయితే మరింత శోభతో కూడిన వాతావరణం నిండి ఉంటుంది. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగలుగా మూడు రోజలు ఎంతో ఆనందంతో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగనాడు వచ్చే తొలి రోజైన భోగి మనకు భోగభాగ్యాలు ఇస్తుందని, 

 

అలానే ఆ రోజున పాత వస్తువులు అగ్నిలో వేస్తే వాటితో పాటే మన ఇబ్బందులతో కూడిన పాత జీవితం కూడా ఆహూతై, ఇకపై మన ఇంట్లో భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రతీతి. అలానే ఆ భోగి పండుగ నాడు బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగు పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. 

 

నిత్యం కేరింతలు కొడుతూ చిలిపి కృష్ణుని మాదిరిగా ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలకు దిష్టి తగులకుండా ఉప్పు దిష్టి, గంటం దిష్టి, కొబ్బరికాయ దిష్టి ఇలా పలు రకాలుగా వారికి దిష్టి తీసేస్తుంటారు. అలానే భోగిపండ్లను కూడా పిల్లలపై పోయడం వలన వారిపై ఉన్న దిష్టిని అది చాలావరకు దూరం చేస్తుందని ప్రతీతి. అందుకే పిల్లవాడిని భోగిపండ్ల వేడుక కోసం కూర్చుండబెట్టిన తర్వాత, ముందుగా తల్లి అతనికి బొట్టు పెట్టి తలచుట్టూ మూడు సార్లు దిష్టి తీస్తూ భోగిపండ్లను పోసి ఆపై ముత్తయిదువలకు కూడా పిల్లవాడి తల మీదుగా పడేట్లు భోగిపండ్లను పోయిస్తారు. ఇలా పిల్లవాడి మీద నుంచి నేలకి రాలిన పండ్లని తినకూడదనని, అలానే వాటిని బీద సాదలకు దానం చేయడం కానీ, లేదా ఎవరూ తొక్కని చోట కానీ పారవేయడమో చేయాలట. మన పెద్దలు ఈ విధమైన పలు పద్ధతుల్లో సంక్రాంతి పండుగను ఎంతో విశేషంగా జరుపుకునేవారట ..... 

మరింత సమాచారం తెలుసుకోండి: