సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు గోదావ‌రి జిల్లాల్లో ముఖ్యంగా కోడిపందాలు ఎక్కువ‌గా ఆడ‌తారు. సంక్రాంతి కోసం ప్ర‌త్యేకంగా ఈ కోళ్ళ‌ను పెంచుతారు. సుమారు ఆరు నెల‌ల నుంచే ఈ కోళ్ళ‌ను పెంచే ప‌నిలో ఉంటారు. మూడు నెల‌ల ముందు నుంచే ఈ కోళ్ళ కోసం అడ్వాన్సులు  ఇచ్చేస్తారు. ఒక్కో పందెంకోడి పెంప‌కానికి నెల‌కు దాదాపు ప‌దివేలు ఖ‌ర్చు పెడ‌తారు. అంటే దానికి బాగా జీడిప‌ప్పు, బాదంప‌ప్పు వంటి వ‌గైరా లాంటి మంచి బ‌ల‌మైన ఆహారం పెడుతూ చాలా జాగ్ర‌త్త‌గా పెంచుతారు. ఈ విధంగా పెంచిన కోడి ధ‌ర ఎక్కువ‌గానే పలుకుతుంది. వీటికోసం మూడు నెల‌ల ముందునుంచే అడ్వాన్సులు ఇస్తారంటే దీని డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పుంజులను పెంచడం, వాటిని పందాలకు సిద్ధం చేయడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 

 

ఈ పందెం కోళ్ళ ధ‌ర‌లు ఏకంగా ల‌క్ష‌ల్లో ప‌లుకుతాయి. ఒక్కో కోడి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ ఉన్నా ఆశ్చ‌ర్యపోన‌వ‌స‌రం లేదు. అంత ధ‌ర‌పెట్టి కొని పందాలు కాసే పందెంరాయుళ్ళు ఊళ్ళ‌ల్లో ఇప్ప‌టికీ త‌క్కువేం లేవు. తీరా ఆ కోడి గెలిచాక వ‌చ్చే లాభం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ మూడు నెల‌ల ఆ కోడిని కొంత మంది ఇంట్లో పిల్ల‌ల‌క‌న్నా జాగ్ర‌త్త‌గా చూసుకుంటార‌ట అంత శ్ర‌ద్ధ‌గా పెంచుతారు ఈ పందెం కోళ్ళ‌ను. చాలామంది అభ్యంతరాలు చెబుతున్నా, కోర్టులు ఆంక్షలు విధిస్తున్నా, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఈ పందేలు మాత్రం ఆగడం లేదు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు అనేక ప్రాంతాల్లో కోడిపందాల జోరు కొనసాగుతుంది. తమిళనాడులో జరిగే జల్లికట్టు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలకు చాలా ఖ్యాతి ఉంది. అయితే రానురాను అది మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: