పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా భావిస్తారు. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం ఉంటుంది. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా క‌డిగి వాటిని క‌నుమ‌రోజు అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖసంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను రైతులు మరిచిపోరు.

 

తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. త‌మ ఇళ్ళ‌ల్లో గోవులు లేక‌పోతే ఆ రోజు ప్ర‌త్యేకంగా ఆల‌యాల‌కు వెళ్ళి మ‌రి గోమాత‌ల‌ను పూజిస్తారు. వాటికి అర‌టిప‌ళ్ళు తీసుకెళ్ళి తినిపిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు.

 

నేడు సంప్ర‌దాయాల క‌న్నా కూడా అట్ట‌హాసాల‌కు ప్ర‌ధానం పెరిగిపోయిన నేప‌థ్యంలో ఏ పండుగ‌ను ఎలా చేసుకోవాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ప్ర‌తి పండుగ‌కు వివ‌ర‌ణ పెరిగిపోయింది. సంక్రాంతి నాడు పితృదేవ‌త‌ల‌కు ఎలా కొత్త బ‌ట్ట‌లు పెట్టుకుంటామో.. క‌నుమ కూడా పితృదేవ‌త‌ల ఆరాధ‌నా పండుగే. అయితే, ఈ రోజు.. పితృదేవ‌త‌ల‌తోపాటు ప‌శుప‌క్ష్యాదుల‌ను పూజించాల‌నే వైశిష్య్టం ఉంది. పితృదేవ‌త‌ల‌కు ఇష్ట‌మైన ఆహారాన్ని వండి వారికి నైవేద్యంగా స‌మ‌ర్పించి.. తీసుకోవాలి. అదేవిధంగా ప‌శుప‌క్ష్యాల‌ను శుభ్రం చేసుకుని వాటిని పూజించి, వాటికి క‌డుపు నిండా ఆహారం అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: