శిరిడీలో కొలువైన సాయిబాబా జన్మ స్థలంపై వివాదం నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఆయన జన్మించినది పథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదానికి తెర లేసింది. పథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. శిరిడీతో సమానంగా దీనిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం నిర్ణయంపై శిరిడీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

పథ్రీని కనుక అభివృద్ధి చేస్తే శిరిడీకి భక్తుల రాక తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రేపటి నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్టు, మ‌రియు రేపు బంద్‌కు కూడా పిలుపునిచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా దీనిపై శిరిడీ సంస్థాన్ బోర్డు స‌భ్యులు మీడియాతో మాట్లాడుతూ.. స్పష్టతనిచ్చారు. శిరిడీ ప్ర‌జ‌లు కేవ‌లం నిర‌స‌న చేప‌డుతున్న‌ట్లు, ప‌ట్ట‌ణ బంద్‌ను మాత్రమే పాటించ‌నున్నామ‌ని చెప్పారు. అంతేగానీ, ఆల‌యాన్ని మూసివేయ‌డం లేద‌ని స్పష్టం చేశారు. ఆల‌యాన్ని తెరిచే ఉంచుతామని, గదుల సౌక‌ర్యం, ప్ర‌సాద విత‌ర‌ణ అన్నీ ఎప్పటిలాగే జ‌రుగుతాయని సంస్థాన్ బోర్డు తెలిపారు. 

 

ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్‌ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తోనూ ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. కాగా, పర్బణి జిల్లాలోని పథ్రీ అనే ఊరే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. శిరిడీకి ఇది 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి శిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు చెబుతుంటారు. ఇక ప్ర‌స్తుతం దీనిపై వివాదాలు జ‌రుగుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: