మేడారం జాతర ... ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం ఇది. తెలంగాణ కుంభ‌మేళా అనిపిల‌వ‌బ‌డే సమ్మక్క - సారక్క జాతర పై చ‌రిత్ర చెప్పిన వివ‌రాల ప్ర‌కారం త‌న కుటుంబ పెద్ద కోసం ఆ కుటుంబంలోని స‌భ్యులు ప్రాణాలు అర్పించిన త్యాగం మ‌న‌కు గోచ‌రిస్తుంది. జాత‌ర గురించి ముందుగా తెలుసుకోవాలంటే మ‌న‌దేశంలో కుంభ‌మేళా త‌రువాత అతిపెద్ద గిరిజ‌న పండుగ‌గ చెప్పుకునే ఈ జాత‌రకు అధిక సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌ర‌వుతుంటారు. కాబ‌ట్టే ఈ పండ‌గ‌ను తెలంగాణ కుంభ‌మేళా అనిపిలుస్తారు. ఈ మేడారం జాతర వచ్చే నెల‌ ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నిర్వహించ‌నున్న సంగ‌తి తెలిసిందే. 

 

ఇదిలా ఉంటే.. మేడారం జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. అనంతరం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సిఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇక స‌మీక్ష‌లో సీఎం మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు మేడారం వెళ్లి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్ లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

 

భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మంచినీరు, పారిశుద్ధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు మంచిది కాదు. అలాగే మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడొద్ద‌ని సూచించారు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలి. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను అక్కడికి పంపాలి. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: