వెంక‌టేశ్వ‌ర‌స్వామి అన‌గానే ముందు మ‌న‌కు గుర్తు వచ్చేది తిరుమ‌ల తిరుప‌తి దేవాల‌యం. భ‌గ‌వంతుడు భ‌క్తుల కోరిక మేర‌కు అన్ని చోట్లా ఉంటాడు అని చెప్పుకుంటారు.  అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం.  ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు.  అంటే సూదిలాగా వున్న పర్వతం.  నిటారుగా వుండే ఈ చిన్న‌ కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. దాంతో ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ మ‌న పూర్వీకులు చెబుతుంటారు.

 


స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో  గురు స్ధానంలో కూర్చుని త‌ప‌స్సు చేసేవారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ.  శ్రీరాముడు భార్య, తమ్ముడితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి రాముడిమీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకు రావటానికి చాలా ప్రయత్నించాడు.  తండ్రి ఆజ్ఞ పాలించాలనే శ్రీరాముడి దృఢ సంకల్పంతో, చేసేదిలేక వెనుతిరిగిన జాబాలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో  తీర్ధయాత్రలు సేవిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి సూచీగిరి మీద తపస్సు చేసుకున్నాడని చెబుతారు.

 

 
అయితే ఈ సూచీగిరి మీద రెండు గుహలున్నాయి.  జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో ఆయ‌నే స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు.  శ్రీహరి వెలిసిన గుహ కనుక అది వైకుంఠ గుహ అయింది. దశరధ మహారాజు ఆస్ధానంలోని జాబాలి మహర్షి ఏమిటి, వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చెయ్యటం ఏమిటి  వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు కదా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? వెంకటేశ్వరస్వామి కృతయుగంలోనే  వెలిశాడనీ, శ్రీరామచంద్రుడు నారాయణాచలములోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నాడని వరాహ పురాణ కధనం ఒకటి ఉంది.

 


ద్వాపర యుగంలో అర్జనుడు పాశుపతాస్త్రంకోసం ఈ సూచీగిరికి తూర్పున వున్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు.  ఆ సమయంలో శివుడు అర్జనుని శక్తి సామర్ధ్యాలు పరీక్షించాలని మూకాసురుణ్ణి వరాహ రూపంలో పంపించటం, మూకాసురుడి మీద అర్జనుడూ, శివుడూ వేసిన బాణాలు ఒకేసారి తగలటంతో వారిద్దరి మధ్యా జరిగిన వాగ్వివాదంలో  అప్పుడు శివుడు అర్జనుణ్ణి మెచ్చుకుని పాశుపతం అనుగ్రహించాడు.  బాణాలు తగిలి  మూకాసురుడు అదృశ్యుడైన చోటే శ్రీ వెంకటేశ్వరస్వామి వెలసిన గుహ అంటారు.  పార్వతీ పరమేశ్వరులు వున్న ప్రదేశం కైలాస గుహ అని ఒక కధనం. జాబాలి మహర్షి తపోదీక్షతో ప్రసిధ్ధమైన ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన అనేకమంది అనేక విధాల శాప విముక్తులయ్యారనే కధలు కూడా అనేక‌మున్నాయి.  అయితే కాల ప్రభావంవల్ల ఈ తీర్ధం ప్రస్తుతం అంతరించిపోయింద‌ని చెప్పుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: