శివుడు ఎలా లింగరూపియైనాడు? అనే ప్రశ్నకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితి కారకుడైన విష్ణువు కారణం. ఈ ఇద్దరిలో ఆధిపత్యం కోసం సాగిన అహంకార ఫలితమే శివలింగోద్భవం అని ప్రతీతి. శివాలయాలలో పరమశివుని ప్రతిమను గర్భగుడిలో ప్రతిష్ఠించిన మూలమూర్తిగా ఉన్నప్పటికినీ ఎన్నడూ ఆరాధించరు. కేవలం ఉత్సవ మూర్తిగనే ఆరాధిస్తారు. ఈశ్వర శబ్దం నుండి ఐశ్వర్యమనే పదం వచ్చింది. పరమశివుని దివ్య దేహోపాధి నుండి బ్రహ్మాండమైన లింగం ఆవిర్భవించి, భూమ్యాకాశములను ఆక్రమించినది.

 

ప్రతి మాసములో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశికి శివరాత్రి అని వ్యవహార నామం. కానీ లింగోద్భవం అయిన కాలము మాఘమాసం, కృష్ణపక్ష చతుర్దశిని ‘మహాశివరాత్రి’ అంటారు. మంగళకరమైన రాత్రి ఇది. రాత్రి చీకటి, అజ్ఞానమునకు సంకేతం. సకల జగతి ఈ చీకటి, అజ్ఞానమును తొలగించుటకు ఈ దినమున, లింగోద్భవ వేళ వరకు ఉపవాసం - జాగరణ - మహేశ్వర దర్శనం - బిల్వార్చన, నామ సంకీర్తనల వలన మంగళకరమై విలసిల్లును గాన ఇది మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందినది.

 

ఆదిశంకరులు శివునిపై ఎన్నో స్తోత్రాలు రచించారు. జగద్గురువులైనారు. స్తుతించిన వారికి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పినాకపాణి. శివనామ వైశిష్ట్యాన్ని మహాకవి ధూర్జటి ఒక పద్యంలో తెల్పుతూ, ఓ శివా నీ నామం వజ్రాయుధాన్ని పూవుగా, నిప్పును మంచుగా, అగాధ జలరాశిని నేలగా, శత్రువును మిత్రునిగా, విషం దివ్యాహారంగా అమృతంగా మారుననీ అంటూ చివరలో ‘శివా.. నీ నామము సర్వవశ్యకరవౌ శ్రీకాళహస్తీశ్వరా’ అని వర్ణించి తరించాడు. తరింపచేశాడు.

 

శివారాధకులు చేసే పూజలకు పార్థివ లింగ పూజ శ్రేష్టమైనది. సాధకులు వైశాఖంలో వజ్రలింగాన్ని, శ్రావణంలో ఇంద్రనీల లింగాన్ని, జ్యేష్ఠంలో మరకత లింగాన్ని, ఆషాఢంలో వౌక్తిక లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధిక, కార్తీకంలో విద్రుమ లింగాన్నీ, మార్గశిరంలో వైఢూర్య లింగాన్ని, మాఘంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణంలో చంద్రకాంత లింగాన్నీ సేవించాలని శివపురాణం చెబుతోంది. ఇంకనూ చల అచల పార్థివ మృత్తిక రస లింగాల ఆరాధన శ్రేష్ఠం.

మరింత సమాచారం తెలుసుకోండి: