ఆంజ‌నేయుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. అలాగే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు.  దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు చాలా అరుదు. ఇక కొన్ని బాగా ప్ర‌సిద్ధి చేందిన ఆల‌యాలు ఉన్నాయి. అందులో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం కూడా ఒక‌టి.  

 

స్వయంభువుగా వెల్సిన శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్‌లో ఉంది. హైదరాబాదు నగర పరిధిలోకి వచ్చే ఈ ఆలయం రంగారెడ్డిజిల్లాలోని ప్రాచీన ఆలయాలలో ఒకటి. ఆలయ చరిత్ర చూసుకుంటే.. పూర్వం ఈ ప్రాంతం లక్ష్మీపురం పేరుతో పిలువబడుతూ అరణ్యంగా ఉండేది. అయితే కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరోజు వేటలో భాగంగా ఈ అరణ్యానికి రాగా పులి గాండ్రింపు వినిపించింది. ప్రతాపరుద్రుడు శబ్దం వస్తున్న దిక్కునే వెళ్ళిననూ కొంత సమయం తర్వాత గాండ్రింపు శబ్దం ఆగిపోయింది. ఎంత వెదికినా పులి కూడా కనిపించలేదు. 

 

అలసిపోయిన చక్రవర్తి ఒక చెట్టు కిందుగా విశ్రమించగా "శ్రీరాం" అనే తారకమంత్రం వినిపించింది. రామశబ్దం వస్తున్న చోటులో వెదకగా ఆంజనేయస్వామి విగ్రహం లభించింది. అదేరోజు రాత్రి కలలో ఆంజనేయుడు ప్రత్యక్షమై విగ్రహం ఉన్నచోట ఆలయం నిర్మించమని ఉపదేశించినట్లు, ప్రతాపరుద్రుడు ఆ కార్యాన్ని పూర్తిచేసినట్లు క్షేత్రచరిత్ర వివరిస్తుంది. ఇక వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో ఉన్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: