వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం శివకళ్యాణ వేడుకలకు సిద్ధమైంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా రానున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

 

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వేములవాడ విరాజిల్లుతోంది. శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఆది దేవుడి కల్యాణ వేడుకలు జరగుతున్నాయి. ఈ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. నిజానికి...రాజన్న ఆలయంలో స్వామి వారి కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోని అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి రోజునే కళ్యాణం జరిపించడం సర్వసాధారణం. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాత్రం మహాశివరాత్రి తర్వాత శివ కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేములవాడ రాజన్న ఆలయంలో వైదిక స్మార్త ఆగమనాన్ని అనుసరించి పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రిని స్వామి వారు జన్మించిన రోజుగా భావిస్తారు. అందుకే పుట్టిన రోజున కల్యాణం నిర్వహించరు. మహా శివరాత్రి, కామ దహనం అనంతరం శివ కల్యాణం జరిపించడం ఆలయ సంప్రదాయం. 

 

ఇక...ఆది దేవుడైన శివుడు తపస్సులో ఉంటే సృష్టి జరగదు అని భావించిన దేవతలు ఆయనకు కోరికలు కల్పించాలని మన్మథ బాణం సంధిస్తారు. శివుడి ఆగ్రహానికి మన్మథుడు భస్మం అవుతాడు. మన్మథ బాణం కోరికలతో పార్వతిని పెళ్లి చేసుకుంటాడని అప్పుడే సృష్టి మొదలవుతుందని శివపురాణంలో పేర్కొన్నారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆ కథను అనుసరించే రాజన్న ఆలయంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తామని తెలిపారు అర్చకులు.

 

ఇక...ఇందులో భాగంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ నెల 11 నుంచి 15 వరకు శివ కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 12న శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి దివ్య కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. 14వ తేది నాడు స్వామి వారి రథోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. శివ కల్యాణ మహోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
మొత్తానికి...శివ కళ్యాణ వేడుకల సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలిరానున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: