ఇప్పుడు వాడుకలో మనం ఉగాది అనేస్తున్నాం కానీ, ఈ ఉగాది అనేది... యుగాది నుండి వచ్చింది అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు! యుగాది లోనే వుంది పరమార్ధం అంతా.. యుగాది అంటే, యుగానికి అది అని అర్ధం... సృష్టి ఆరంభంలో, బ్రహ్మదేవుడు తన సృష్టి మొదలు పెట్టిన రోజు ఇదేనని  అంటారు!!  సృష్టికర్త బ్రహ్మ దేవుడు తన సృష్టి ప్రారంభించిన రోజే యుగానికి మొదలు.. యుగాది.  అదే తర్వాత వాడుకలో ఉగాది అయింది.

 

ప్రతి ఏటా దీనికి గుర్తుగానే... ఉగాదినాడు కొత్త సంవత్సరం మన వాళ్ళు ముఖ్యంగా, మన తెలుగు వారు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, దైవారాధన చేసి, ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి ఆ పచ్చడిని పరగడుపునే తినాలి అని మన పూర్వికులు చెప్పారు, మనం ఎంతో నిష్ఠతో ఈరోజుకీ ఆచరిస్తున్నాం... యుగాదికి గుర్తుగా జరుపుకునే ఈ ఉగాది రోజున చేసే పచ్చడిలో  కొత్తదనాన్ని సూచిస్తూ కొత్త బెల్లం, కొత్త చింతపండు, అప్పుడే పూస్తున్న వేప పువ్వు,  కొత్తగా కాస్తున్న మామిడికాయ, ఉప్పు కూడా అప్పుడే ఆరబెట్టినది చూసుకొని, అన్నింటిని మేళవింపు చేసుకొని, మిత్రులకు, బంధు వర్గానికి పంచుతాం.

 

ఉగాదినాడు, పరంపరగా మనం పంచాంగ శ్రవణం చేస్తున్న సంగతి తెలిసినదే.  కాలాన్ని దైవశక్తిగా ఉపాసించడం మన భారతీయుల సంప్రదాయం.  కాలం కలిసి రావాలని ఎవరు మాత్రం అనుకోరు. కాలం అనుకూలించటానికి అందులో అంతర్లీనమైన దైవ శక్తిని మనం పఠించి, సమన్వయ పరుచుకోవాలి. ప్రతి సంవత్సరం కాలపురుషుని సంవత్సరావతారాన్ని స్మరించుకుంటాం. సంవత్సరానికి మొదటి రోజు తిధి, వార, నక్షత్ర దేవతల్ని సంవత్సరంలో సంభవించే ప్రధాన ఖగోళ పరిణామాలనీ యధావిధిగా మనం  తెలుసుకుంటాము.

 

వసంత నవరాత్రులు ఈ ఉగాదినాడే ఆరంభం అవుతాయనే సంగతి విదితమే. ఈ రోజుతో మొదలైన  నవరాత్రులు శ్రీ రామ కళ్యాణంతో ముగుస్తాయి. శ్రీరాముడు, రామాయణం అంటే, హిందువులకు ఎంతో ప్రీతి. ఎందుకంటే, శ్రీరాముడు ధర్మాన్ని పాటించి ఒక మనిషి ఎలా జీవించాలో తెలియజేశాడు. ఆయన్నే మనం ఈరోజికీ... హీరోలా భావిస్తాం. అతనే మన రోల్ మోడల్. ఆయన సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారం.  ఇన్ని విశేషతలు కలిగిన మన ఉగాది పండగ అందరికీ సుఖ సొంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: