ఆంజనేయస్వామి.. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ, మారుతి అనీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్న ఆంజనేయస్వామి భక్తులకు సుపరిచితమైన పేరు శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ఆంజనేయస్వామి ఆలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో గల కసాపురం అనే గ్రామంలో ఉన్నది.

 

నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్నుగలవాడని అర్థం. స్వామికి కుడి కన్ను మాత్రమే ఉంటుంది. ఆల‌య చ‌రిత్ర ప‌రిశీలిస్తే.. వ్యాసరాయలవారు గొప్ప చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి మాయ‌మైపోయేవాడట. ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట. 

 

ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించుఅని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేషించమని వ్యాస రాయల వారు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు. ఏమనగా - దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుందని, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుందని, అక్కడ భూమిలో తాను ఉంటాను అని చెప్పారట. 

 

మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణంగావించి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయల వారు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు కాస్త ఆకుపచ్చగా చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయల వారు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తాడు. ఇక ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: