శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో  మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకి జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. శ్రీ రామ నవమిని హిందువులు అందరు ఎంతో భక్తి శ్రద్దలతో, పవిత్రంగా చేసుకుంటారు.  చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి పుట్టడం, అలాగే  వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి రోజే. సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో  గల భద్రాచలం అందు  సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు.

 

అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. అయితే రావణుడు సీతమ్మని అపహరించుకుని పోతాడు.. దీనితో రాముడు ఆగ్రహానికి లోనై సీతని తీసుకుని వెళ్లిన రావణుడిని సంహారం చేసి సీతమ్మని, ధర్మాన్ని, ప్రజలని కాపాడాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, భార్యని  ఎలా కాపాడుకోవాలి, ఒక అన్నగా, తండ్రి మాటని గౌరవించే కొడుకుగా, తల్లికి బిడ్డగా, ఏకపత్నీవ్రతుడుగా శ్రీరామచంద్రుడు. మన అందరికి ఆదర్శంగా నిలిచారు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి.

 

శ్రీ రామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.

 

శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి.

 

అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: