ఈనాటి యువత ఉక్కు కడ్దిలాంటి వారంటు ఆనాడే భారతదేశ యువతను మేల్కొలిపిన మహానీయుడు స్వామి వివేకానంద.. ఒక వ్యక్తి జీవితం నిరాశ నిస్పృహలతో నిండినప్పుడు, భయ భ్రాంతులకు గురై, మనసు చెడు మార్గాలవైపు మళ్ళి ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నపుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబందించిన పుస్తకాలు, సూక్తులను చదివితే చాలు వివేకానందుడి సందేశాలు సూటిగా ఆ హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం వెన్నుతట్టి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.. అప్పటివరకు ఉన్న ఆలోచనలో మార్పు కలిగి జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది.

 

 

నేటికాలంలో తీసుకుంటే ఎందరో బాబాలు, మరెందరో స్వామీజీలు దైవాంశసంభూతులుగా చెప్పుకుంటూనే ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు.. అందుకే వారు యువతకిచ్చే సందేశంలోని వ్యాక్యాలు అమృతపదాలుగా వర్ధిల్లడం లేదు. అందువల్ల ప్రజలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు.. కానీ స్వామి వివేకానంద తన ప్రసంగంతో యావత్ దేశప్రజానీకం మనసులనే దోచుకున్నాడు.. ఒక ఇండియన్ అని చులకన చేసి అవమానించిన వారి నోళ్లు మూయించాడు.. అలా స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఇకపోతే వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం, తత్త్వ శాస్త్రములోనే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది.

 

 

ఇక "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. ఒకరకంగా ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక మహ్మదీయుడు మంచి మహ్మదీయుడిగా, ఒక హిందువు మంచి హిందువుగా ఉంటే చాలని చెప్పారు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని ఏ దారిలో వెళ్లిన మనమందరం ఒకే చోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయన చెప్పారు.

 

 

ఇక వ్యక్తిగత మోక్షము పై వ్యామోహమును కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మహానుభావుడు.. ఇదే కాకుండా తన మరణానికి తానే మూహూర్తం నిర్ణయించుకున్న గొప్ప యోగి.. నిద్రానమై ఉన్న భారతజాతిని మేల్కొలిపిన ఆ మహనీయుడు, యుగ పురుషుడు ఎప్పటికి మన గుండెల్లో నిలిచే ఉంటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: