కొంత‌మంది భ‌క్తుల ఆలోచ‌న‌...శిల్ప‌లాల‌ను త‌యారు చేసే ఓ బృందం సంవ‌త్స‌ర కాలం క‌ఠోర శ్ర‌మ ఫ‌లితంగా అగ్ర‌రాజ్యం అమెరికాలో హనుమంతుడి భారీ విగ్ర‌హం నెల‌కొల్ప‌బ‌డింది. అమెరికాలోని డెలావర్ రాష్ట్రంలోని అక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు అంజనేయస్వామి విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించారు. సుమారు 25 అడుగుల ఎత్తూ ముప్పై టన్నుల బరువు ఉండే ఈ విగ్రహాన్ని వరంగల్ నుంచి సప్త సముద్రాలు దాటించి భ‌క్తులు అమెరికా తీసుకెళ్లండం గ‌మ‌నార్హం. కరీంనగర్‌కు చెందిన రాజు తన తోటి శిల్పుల‌తో క‌ల‌సి ఈ విగ్ర‌హాన్ని రూపొందించారు. 12 మంది సభ్యులు సుమారు సంవ‌త్స‌ర కాలం పాటు కష్టపడి ఈ విగ్రహానికి రూప‌మివ్వ‌డం విశేషం. జనవరిలో ఈ విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరానికి షిప్ ద్వారా తరలించారు. అక్కడి నుంచి ట్రక్ ద్వారా డెలావర్ రాష్ట్రంలోని హాకేస్సన్ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

 

నిర్వాహాకులు, భ‌క్తులు, శిల్పుల స‌మ‌ష్టి కృషి ఫ‌లితంగా అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ట జ‌రిగింది. ఈ విగ్ర‌హం అమెరికాలోనే ఎతైన హిందూ దేవుడి విగ్రహం కావ‌డం గ‌మ‌నార్హం.  డెలవేర్ రాష్ట్రం హాకెసిన్​లో ప్రతిష్ట జ‌ర‌గ‌గా కొద్ది మంది భ‌క్తులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో భారీ స్థాయిలో కాకుండా.. సాధారణ ఏర్పాట్లతో విగ్రహ ప్రతిష్ట చేసిన‌ట్లుగా సంఘం సభ్యులు తెలిపారు. విగ్ర‌హ ఏర్పాట్ల‌లో భాగంగా యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 25 అడుగుల ఎత్తు క‌లిగిన ఈ విగ్ర‌హం దాదాపు 30 టన్నుల బరువు  ఉంటుంద‌ని నిర్వాహాకులు తెలిపారు. 

 

డెలావర్ లో ఉన్న ఎత్తైన విగ్రహాలలో ఇది రెండవది. మొదటిది న్యూ కాజిల్‌లోని హోలీ స్పిరిట్ చర్చిలో లేడీ క్వీన్ ఆఫ్ పీస్ విగ్రహం. హ‌నుమాన్ ప్ర‌తిమ‌ను  గ్రానైట్ రాయిపై చెక్కారు. దీనిని చెక్కడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టినట్లు శిల్పుల బృందం తెలిపింది. కరోనావైరస్ విజృంభిస్తోన్న కారణంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వేడుకలలో ఎక్కువ మందిని ఆహ్వానించ‌లేక‌పోయామ‌ని, ఏటా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లుగా అమెరికాలో హిందూ టెంపుల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటిబంధ‌ శర్మ తెలిపారు. హ‌నుమాన్ భ‌క్తులంద‌రూ కూడా ఇక్క‌డ స్వామి వారికి పూజ‌లు చేసుకోవ‌డానికి వీలుగా ఉంటుంద‌నే ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు. హ‌నుమాన్ ప్ర‌తిష్ఠ‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: